Sunday, May 19, 2024
Homeజిల్లా వార్తలువైద్యానికి ‘పెద్ది’ భరోసా

వైద్యానికి ‘పెద్ది’ భరోసా

జిల్లా ఆస్పత్రిగా నర్సంపేట దవాఖాన 

ఎమ్మెల్యే పెద్ది ప్రత్యేక చొరవ 

రేపు మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా శంకుస్థాపన

తీరనున్న నియోజకవర్గ పేదల వైద్య కష్టాలు

స్పాట్ వాయిస్, నర్సంపేట: నర్సంపేట నియోజకవర్గంతోపాటు చుట్టుపక్కల జిల్లాల పేదలకు వైద్యం కోసం నర్సంపేటకు జిల్లాస్థాయి ఆస్పత్రి మంజూరైంది. సీఎం కేసీఆర్, వైద్యశాఖ మంత్రి హరీష్ రావు వద్ద ఉన్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఉన్న చొరవతో జిల్లాస్థాయి ఆస్పత్రిని తీసుకొచ్చారు. ఈ దవాఖాన నిర్మాణానికి శనివారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎమ్మెల్యే పెద్ది తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. నర్సంపేటకు రూ.66 కోట్ల వ్యయంతో 250 పడకల ఆస్పత్రి మంజూరైందని చెప్పారు. టీ హబ్‌లో భాగంగా డయాగ్నస్టిక్ సెంటర్‌ను సైతం మంజూరు చేయించినట్లు తెలిపారు. దీని ద్వారా 57 రకాల ఉచిత వైద్య పరీక్షలు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలోని ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు  57 సబ్ సెంటర్లు ఉండగా 25 సబ్ సెంటర్ల నూతన భవన నిర్మాణం కోసం 4.5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. నర్సంపేట కు ఆర్టీపీసీ టెస్ట్ సెంటర్ తోపాటు ల్యాబ్ సైతం మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. వీటితోపాటు ఉచిత కంటి పరీక్షల నిర్వహణ, మందులు, సర్జరీ, కంటి అద్దాలు పంపిణీ సైతం నర్సంపేటలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లే చెప్పారు. సుమారు రూ. 85 కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గ ప్రజల వైద్య సహాయం కోసం వచ్చే 50 సంవత్సరాల వరకు ఉపయోగపడే ఆసుపత్రి నిర్మాణంతో పాటు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసే పరికరాలను మంజూరు చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలియజేశారు. ఆస్పత్రిలో పని చేసేందుకు 244 సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నారని తెలిపారు.  శంకుస్థాపన కార్యక్రమానికి జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్మన్ ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు.

వైద్యంలో నంబర్ వన్…

రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన ఉచిత డయాలసిస్ సర్వీస్ సెంటర్ల సేవలతో పాటు బ్లడ్ బ్యాంక్ సేవలు కూడా నర్సంపేట లో ప్రస్తుతం కొనసాగుతున్నాయన్నారు. అదేవిధంగా అత్యవసర వైద్య సేవల కోసం వైద్య శాఖ మంత్రి నియోజకవర్గానికి రెండో అంబులెన్స్ మంజూరు చేశారని ఎమ్మెల్యే పెద్ది చెప్పారు. హాస్పిటల్ నిర్మాణం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం సొంత భూమిని విరాళంగా ఇచ్చిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, లింగగిరి వాస్తవ్యుడు దొడ్డ మోహన్ రావును ఈ సందర్బంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని ఒకవేళ ప్రభుత్వం మెడికల్ కాలేజీ మంజూరు చేస్తే దానికి అనుగుణంగా హాస్పిటల్ నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. నర్సంపేట నియోజకవర్గంవర్గంలో ఈ ఆసుపత్రి రావడానికి కారణమైన ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వాకాటి కరుణ, జిల్లా కలెక్టర్ కు నర్సంపేట ప్రజలందరి తరఫున ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మహిళలకు క్రీడలు..

మార్చి 8న జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నర్సంపేట నియోజకవర్గంలో శనివారం నుంచి నిర్వహించనున్న మహిళా క్రీడోత్సవాలను మంత్రి తన్నీరు హరీష్ రావు  ప్రారంభిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. క్రీడలు వారం రోజులపాటు నిర్వహించబడతాయని, ఈ క్రీడల్లో పాల్గొనడానికి నియోజకవర్గంలోని ఆసక్తి గల మహిళలు ముందుకురావాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సమావేశంలో ఓడీసీఎంఎస్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు, ఆర్ ఎస్ ఎస్ రాష్ట్ర డైరెక్టర్, పట్టణ పార్టీ ముఖ్య నాయకులు, కౌన్సిలర్లు, క్లస్టర్ బాధ్యులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments