Tuesday, May 7, 2024
Homeటాప్ స్టోరీస్కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు..!

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు..!

11 స్థానాల్లో పోటీ చేసేది వీరే..
కొలిక్కి రాని ఆరు నియోజకవర్గాలు
అధిష్టానానికి వదిలేసిన స్క్రీనింగ్ కమిటీ
స్పాట్ వాయిస్, బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల ఊపు పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొనసాగించేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. అభ్యర్థుల ఎంపికపై జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌ రెడ్డి ఇంట్లో తాజాగా దాదాపు 2 గంటలు స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు 309 దరఖాస్తులు రాగా, ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ వాటిని పరిశీలన చేసి, ఒక్కో నియోజకవర్గానికి మూడు నుంచి నాలుగు పేర్లతో కూడిన జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. ఆ జాబితాతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఏఐసీసీ, పీసీసీ స్థాయిలో ఇచ్చిన హామీలు, కొత్తగా పార్టీలో చేరిన నేతలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్‌ కమిటీ విస్తృతంగా చర్చించింది. ఈ క్రమంలోనే 11 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులపై ఒక అంచనాకు వచ్చినట్లు తెలిసింది.
టికెట్ వీరికే..!
మహబూబ్‌నగర్ లోక్‌సభ అభ్యర్థిగా ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌ రెడ్డిని కోస్గీ బహిరంగ సభలో సీఎం రేవంత్‌ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఇక 16 లోక్‌సభ స్థానాలపై చర్చలు జరిపిన స్క్రీనింగ్ కమిటీ కొందరి పేర్లను కొలిక్కి తెచ్చింది. కరీంనగర్ నుంచి ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి, నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ పేరు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. జహీరాబాద్ నుంచి సురేశ్​ షెట్కార్, చేవెళ్ల నుంచి సునీతా మహేందర్‌ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్ కుటుంబం నుంచి పేరు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. నల్గొండ నుంచి జానారెడ్డి కుటుంబ నుంచి టికెట్టు ఇచ్చే అవకాశం ఉంది. భువనగిరి నుంచి చామల కిరణ్‌ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్‌ పేరును ప్రతిపాదించినట్లు విశ్వసనీయ సమాచారం. ఖమ్మం, నాగర్​కర్నూల్, వరంగల్, ఆదిలాబాద్, మెదక్, మల్కాజ్‌గిరి అభ్యర్థుల ఎంపికలో ఏకాభిప్రాయం కుదరలేదని తెలిసింది. ఖమ్మం నుంచి రాహుల్‌ గాంధీ పోటీ చేసే అవకాశం ఉండటం, ఉప ముఖ్య మంత్రితో పాటు మరో ఇద్దరు మంత్రుల కుటుంబాల నుంచి టికెట్ ఆశిస్తుండటంతో నిర్ణయం అధిష్టానానికి వదిలి పెట్టినట్లు తెలుస్తోంది. నాగర్‌ కర్నూల్ నుంచి పోటీకి మల్లురవితో పాటు మరికొందరు టికెట్ ఆశిస్తుండటంతో ఎటూ తేల్చలేదు. స్క్రీనింగ్ కమిటీ సిద్ధం చేసిన అభ్యర్థుల జాబితాలు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించింది. కేంద్ర ఎన్నికల కమిటీ ఆ జాబితాను పరిశీలించి, అభ్యర్థుల ఎంపికను అధికారికంగా ప్రకటించనుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments