Tuesday, December 3, 2024
Homeజిల్లా వార్తలుజాతర వైభవంగా నిర్వహించాలి... ఎమ్మెల్యే గండ్ర

జాతర వైభవంగా నిర్వహించాలి… ఎమ్మెల్యే గండ్ర

కొడవటంచలో ఏర్పాటు చేయాలి
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి
ఆలయంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
13నుంచి 20 వరకు నృసింహుడి బ్రహ్మోత్సవాలు
స్పాట్ వాయిస్, రేగొండ: కొడవటంచ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు. మండలంలోని కొడవటంచ ఆలయ ప్రాంగణంలో ఆలయ చైర్మన్ హింగే మహేందర్ అధ్యక్షతన శనివారం ఏర్పాటుచేసిన జాతర సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్రకు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోటి రూపాయలతో నిర్మాణం చేపట్టిన ఆలయ గోపుర సలహరం పనులకు శంకుస్థాపన చేశారు. రూ.75 లక్షల సింగరేణి నిధులతో నిర్మించిన కల్యాణ మండపం రేకుల షెడ్డు, ఐదు గదులతో నిర్మించిన సత్రాలను ప్రారంభించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ నెల 13 నుంచి 20 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు సాగుతాయన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు తక్షణమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జాతర ప్రాంగణంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి 24 గంటలు వైద్యులను అందుబాటులో ఉంచాలన్నారు. కొడవటంచ నుంచి చల్లగాగరిగ, రేపాకకు పక్కకు, గూడపల్లికి వెళ్లే దారిలో పిచ్చి చెట్లను కొట్టించి మరమ్మతులు చేపట్టాలని అన్నారు. జాతరలో ఒక్క క్షణం కూడా కరెంటు పోకుండా చూడాలని విద్యుత్ అధికారులకు సూచించారు. తాగునీటి వసతి కల్పించాలని సూచించారు. భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు మాట్లాడుతూ.. 200 మంది పోలీసులు, ఎనిమిది మంది ఎస్సైలు, ఇద్దరు సీఐలు జాతరలో బందోబస్తు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆర్టీసీ డీఎం ధరమ్ సింగ్ మాట్లాడుతూ.. భుపాలపల్లి నుంచి 10 బస్సులు పరకాల డిపో నుంచి పది బస్సులు జాతరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఆర్డీవో శ్రీనివాస్, సీపీఓ శ్యాముల్, డీఎం హెచ్ ఓ శ్రీరామ్, ఎంపీపీ పున్నం లక్ష్మి, జెడ్పీటీసీ సాయి విజయ, పీఏసీఎస్ చైర్మన్ నడిపల్లి విజ్జన్ రావు, ఆలయ ఈవో శ్రీనివాస్, సర్పంచ్ పబ్బ శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి రవీందర్ రావు, ఎన్ ఎస్ ఆర్ సంస్థల చైర్మన్ నాయినేని సంపత్ రావు, తహసీల్దార్ జివాకర్ రెడ్డి, సీఐ పులి వెంకట్, ఎంపీడీవో సురేందర్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments