తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమ నేత కన్నుమూత
స్పాట్ వాయిస్, గణపురం: తెలంగాణ ఉద్యమకారుడు, తొలి, మలిదశ ఉద్యమ నేత ముక్కెర సాయిలు (85) మంగళవారం మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గంలో తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా ఇక్కడ ప్రజలను ఉద్యమం వైపు మళ్లించడంలో కీలకపాత్ర పోషించాడు. తొలి ఉద్యమ సమయంలో జైలు జీవితాన్ని కూడా గడిపారు. కేసీఆర్ టీఆర్‌ఎస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి కేసీఆర్ ఆధ్వర్యంలో మండలంలో పార్టీ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారు. మండల ప్రజలు సాయిలును ప్రేమగా బాపు అని పిలుచుకుంటారు.టీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని గణపురం మండలంలో ముందుండి నడిపించారు.
నేడు గణపురం లో అంత్యక్రియలు
తెలంగాణ ఉద్యమ కారుడు ముక్కెర సాయిలు అంత్యక్రియలు బుధవారం గణపురం మండల కేంద్రంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఉదయం 11 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం అవుతుందని వారు సూచించారు. అంత్యక్రియలకు తెలంగాణ తొలి శాసనసభ సభాపతి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొననున్నట్లు సమాచారం.
Recent Comments