అకాల వర్షం..
కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
వందలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
నిండా మునిగిన అన్నదాత
స్పాట్ వాయిస్, బ్యూరో : రాష్ట్రంలో అకాల వర్షాలు రైతన్నను నిండాముంచాయి. శుక్రవారం మొదలైన వాన శనివారం సైతం కొనసాగింది. దీంతో వందలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసిపోయింది. అయితే టార్పాలిన్లు లేకపోవడంతో వరదలో వడ్లు కొట్టుకుపోయాయి. ధాన్యం నీటిపాలవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. వారం రోజులైనా ధాన్యం కాంటా అవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వరంగల్, హనుమకొండ, జనగామ, ములుగు కాజీపేటతోపాటు ధర్మసాగర్, వేలేరు, మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్‌లో, తరిగొప్పుల మండలంలో భారీ వర్షం కురవడంతో వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. జనగామ జిల్లా జఫర్ గఢ్ మండలం ఉప్పుగల్లు, తిమ్మంపేటతో పాటు పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిసిముద్దయ్యాయి. కాగా, ఈదురు గాలులతో చెట్లు నేలకొరకగా, పలుచోట్ల కరంట్ సరఫరాకు అంతరాయం కలిగింది. కాగా, వర్షాలకు వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వేసవి ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనాన్ని కలిగించింది.
Recent Comments