Monday, May 20, 2024
Homeరాజకీయంమా భవిష్యత్ బుగ్గి పాలు చేశారు

మా భవిష్యత్ బుగ్గి పాలు చేశారు

మీ తప్పుడు నిర్ణయంతో మా జీవితాలు నాశనం అయ్యాయి..
మాజీ గవర్నర్ తమిళి సైకి దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
స్పాట్ వాయిస్, బ్యూరో: చట్టవిరుద్ధమైన నిర్ణయంతో తమ భవిష్యత్తు, జీవితాలు నాశనం చేశారన్న విషయాన్ని గుర్తించి ఆత్మశోధన చేసుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ను బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఎక్స్​వేదికగా కోరారు. గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన బహిరంగ లేఖ రాశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్తున్నందుకు తమిళిసైకి అభినందనలు తెలిపారు. నామినేటెడ్ ఎమ్మెల్సీల విషయంలో హైకోర్టు ఆదేశాల తర్వాత న్యాయం గెలుస్తుందన్న ఆశతో విజ్ఞప్తి చేశామన్న శ్రవణ్, గతంలో తీసుకున్న చట్టవిరుద్ధ నిర్ణయాన్ని సరిచేసి తమను శాసనమండలి సభ్యులుగా నియమిస్తారని ఆశించినట్లు లేఖలో పేర్కొన్నారు.

బహిరంగ లేఖ
గౌరవనీయులైన మాజీ గవర్నర్, శ్రీమతి డా. తమిళిసై గారు..

అమ్మా!!!
@DrTamilisaiGuv

పార్లమెంటు సభ్యురాలిగా పోటీ చేసేందుకై మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజకీయాలలో మీకున్న విస్తృతమైన అనుభవం మీ లక్ష్యాన్ని చేరుకోవడంలో తప్పకుండా తోడ్పడుతుందని భావిస్తున్నాను.

మార్చి 7, 2024 నాటి WP 180 & 181 కేసుల్లో ఇటీవలి హైకోర్టు ఆదేశాల తర్వాత న్యాయం గెలుస్తుందని ఆశించి మీకు విన్నవించుకున్నాం. హైకోర్టు ఆదేశాలు అమలు చేయండి, రాజ్యాంగాన్ని కాపాడండి, మా లాంటి వెనుకబడినవర్గాలకు చెందినవారికి న్యాయం చేయమని చేతులు జోడించి నమస్కారించాం.

కనీసం హైకోర్టు ఆదేశాల తర్వాతనైనా, మీ మునుపటి చట్ట విరుద్దమైన నిర్ణయాన్ని సరిదిద్దుకొని, మమ్మల్ని శాసన మండలి సభ్యులు గా నియమిస్తారని ఎంతగానో ఆశతో ఎదురుచూశాం. కానీ మీ తప్పును సరిచేసుకోలేదు, పైగా మా విజ్ఞప్తులను అలక్ష్యం చేసారు.

కానీ, అపరిపక్వ, తప్పుడు న్యాయ సలహాపై మీరు ఆధారపడటం, తద్వారా మీరు తీసుకున్న వివాదాస్పద రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయం కారణంగా బడుగులమైన మాకు, మా కుటుంబాలకు తీరని అన్యాయం.

గత ప్రభుత్వం పట్ల మీకున్న రాజకీయ శత్రుత్వంతో, మాకు రాజకీయ నేపథ్యం ఉన్నది అనే కుంటి సాకుతో మా త్యాగాలు, మాకున్న అర్హతలు, సమాజానికి మేము చేసిన కృషిని తమరు కావాలనే విస్మరించి, మా భవిష్యత్తు బుగ్గి పాలు చేసారు.

మేము చాలా అట్టడుగు అణచివేతకు గురైన వర్గాల నుండి వచ్చాం అనే విషయాన్నీ విస్మరించి, మీరు రాజ్యాంగాన్ని తప్పుదారి పట్టిస్తూ , చట్టవిరుద్ధమైన మీ నిర్ణయంతో మా కెరియర్, మా భవిష్యత్తు, పూర్తిగా మా జీవితాలు నాశనం చేశారనే విషయాన్నీ గుర్తిస్తూ, మీరు దయతో ఆత్మ శోధన చేసుకోవాలని విజ్ఞప్తి.

మీ తప్పుడు నిర్ణయం వల్ల మా జీవితాలు నాశనం అయినప్పటికీ, మీ రాజకీయ జీవితంలో మీరు తప్పనిసరిగా విజయం సాధించాలని మేము హృదయపూర్వకంగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం.

ధన్యవాదాలు..
డాక్టర్ శ్రవణ్ దాసోజు
కుర్రా సత్యనారాయణ

RELATED ARTICLES

Most Popular

Recent Comments