Sunday, May 19, 2024
Homeజాతీయంటీపీయూఎస్ ఆధ్వర్యంలో ఘనంగా గురుపూజోత్సవం

టీపీయూఎస్ ఆధ్వర్యంలో ఘనంగా గురుపూజోత్సవం


*హనుమకొండ, వరంగల్ జిల్లాల నుంచి 30 మంది ఉపాధ్యాయులకు సన్మానం

*ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే నా ధ్యేయం
: ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి
* విజ్ఞాన జ్యోతులు వెలిగించేవాడు గురువు
: ప్రముఖ పాత్రికేయులు భాస్కర యోగి
* సమస్యల పరిష్కారం కోసం దశల వారీ ఉద్యమాలు
: టీపీయూఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్
స్పాట్ వాయిస్, హనుమకొండ : తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) వరంగల్ హనుమకొండ జిల్లాల ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండ బాల సముద్రంలోని సామా జగన్మోహన్ స్మారక భవనంలో గురు పూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వ్యాస పౌర్ణమిని పురస్కరించుకొని వివిధ మండలాల్లో నిబద్ధత, అంకితభావంతో పనిచేస్తున్న 30 మంది హనుమకొండ, వరంగల్ జిల్లాలకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులను ముఖ్య అతిథి,ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, ప్రధాన వక్త, ప్రముఖ పాత్రికేయుడు భాస్కరయోగి, ఆత్మీయ అతిథి తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్ ఘనంగా సత్కరించారు. గత 19 ఏళ్లుగా మండలానికో ఉపాధ్యాయుడి చొప్పున సంఘాలకు అతీతంగా టీపీయూఎస్ మండల బాధ్యులచే ఉపాధ్యాయులను ఎలాంటి దరఖాస్తు లేకుండా ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి అవార్డులు అందిస్తున్నామని వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బత్తిని వెంకటరమణ, ఆముదాల దాత మహర్షి, ఉప్పుల సతీష్, బత్తిని వీరస్వామి తెలిపారు.

*సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తా..
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలపై ఉదాసీనంగా వ్యవహరిస్తోందని, సమస్యల పరిష్కారం కోసం శాసనమండలిలో గళమెత్తుతానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి తెలిపారు. బదిలీలు, ప్రమోషన్లు, నూతన పీఆర్సీ ఏర్పాటు, డీఏలు, హెల్త్ కార్డులు, సీపీఎస్ రద్దు, కేజీవీవీ, మోడల్ స్కూల్ సమస్యలు, పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికులు, నూతన ఉపాధ్యాయ నియమకాలు, 317 ఉపాధ్యాయుల సమస్యలపై ఉపాధ్యాయుల పక్షాన పోరాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. తనపై ఎంతో నమ్మకంతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా భారీ మెజారిటీతో టీచర్లందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. ఉపాధ్యాయుల హక్కులతో పాటు బాధ్యతలపై వివిధ కార్యక్రమాలు చేస్తున్న జాతీయవాద ఉపాధ్యాయ సంఘం టీపీయూఎస్ కృషిని ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి కొనియాడారు.

* విజ్ఞాన జ్యోతులు వెలిగించేవాడు గురువు
ప్రముఖ కాలమిస్ట్ భాస్కర యోగి
అజ్ఞానాంధకారం తొలగించి విజ్ఞాన జ్యోతులు వెలిగించేవాడే గురువని ప్రధాన వక్త, ప్రముఖ పాత్రికేయులు భాస్కర యోగి అన్నారు. గురుస్థానం భాషకు అందని మహోన్నతమైనదని, సమస్త జ్ఞానాన్ని సముపార్జించి, ఆచరించి చూపేవాడు ఆచార్యుడన్నారు. జ్ఞానజ్యోతిని వెలిగించే గురువే లేకపోతే జీవిత పథం అంధకారం అవుతుందన్నారు. గురువుకు అంత విలువ ఉంది కనుకనే అవతార పురుషులు, అసామాన్యులు కూడా సామాన్యుల మాదిరిగా వారివద్ద విద్యా బుద్ధులు నేర్చారని, శ్రీ రామచంద్రుడు గురువు వశిష్ఠుని పాద తీర్థం శిరస్సున చల్లుకొని భక్తితో దివ్యబోధనను (యోగావాసిష్ఠం) ఆలకించాడని తెలిపారు. శ్రీకృష్ణుడు సాందీప మహామునికి శుశ్రూష చేసి విద్యను అభ్యసించి జగద్గురువయ్యాడన్నారు. అంతటి విశిష్టత కలిగిన గురువులను గౌరవించుకోవడం సనాతన సంప్రదాయమని అన్నారు. విద్య, ఉపాధ్యాయుడి గురించి, సనాతన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, విలువలపై తపస్ సంఘం చేస్తున్న కృషి గొప్పదని కొనియాడారు.

*సమస్యల పరిష్కారం కోసం దశలవారీ ఆందోళనలు
టీపీయూఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్

ఇటీవల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీపీయూఎస్ అభ్యర్థి విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి కార్యకర్త త్వరలో జరిగే నల్లగొండ , వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీపీయూఎస్ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్ సూచించారు. సంఘ బలోపేతానికి అందరూ పాటుపడాలని, రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సమస్యలపై ఈనె ల, వచ్చే నెల దశలవారీ ఆందోళన కార్యక్రమాలను చేస్తున్నామని, ప్రతీ ఉపాధ్యాయుడు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలని, సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు.

కాగా, ఉపాధ్యాయ సమస్యలపై పలువురు ప్రతినిధులు ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి కు వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్సీ గారు అన్ని సమస్యలపై ఉన్నతాధికారులతో విద్యాశాఖ మంత్రితో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కాగా, ఈసందర్భంగా ఉప్పుల సహస్ర తేజ చేసిన కూచిపూడి నృత్యం, ఉపాధ్యాయులు పాడిన దేశభక్తి గేయాలు ఆహుతులను మంత్రముగ్ధులను చేశాయి. కార్యక్రమంలో టీపీయూఎస్ నాయకులు దాత మహర్షి, వెంకటరమణ, ఉప్పుల సతీష్, వీరస్వామితోపాటు పూర్వ వరంగల్ జిల్లా అధ్యక్షులు దాస్యం రామానుజ స్వామి, పిన్నింటి బాలాజీ రావు, మాచర్ల భిక్షపతి, సీఎంవో బోయినపల్లి రాధ, మండల విద్యాశాఖ అధికారులు రత్నమాల, చదువుల సత్యనారాయణ, ఈసరి రవీందర్, రాంధన్, నాయకులు ఆకోజు మనోజ్ కుమార్, సామల కవిత, శ్రీలత, డాక్టర్ సంగెం శ్రీనివాస్, మల్లారెడ్డి, బాబురావు, సత్యనారాయణరావు, రాంభూపాల్, తిరుపతి రావు, ప్రసాద్, ఆమంచ రవికుమార్, శ్రీనివాస్, రమణరావు, రజిత, సదానందం, రమణయ్య, మంజుల, మీస నవీన్, శ్రీధర్, రామకృష్ణ, రాజమౌళి, దయాకర్ తో పాటు 500మందికి పైగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments