ప్రొడ్యూసర్ కు బెదిరింపు కాల్స్..
స్పందించిన కేంద్ర ప్రభుత్వం
1+1 సీఆర్పీఎఫ్ జవాన్‌లతో భద్రత..
చర్చనీయాంశంగా మారిన సెక్యూరిటీ కేటాయింపు
స్పాట్ వాయిస్, బ్యూరో: తెలంగాణ ప్రాంతంలో నిజాం కాలంనాటి పరిస్థితులు, రజాకార్ల అకృత్యాలను కళ్లకు కట్టినట్లు రజాకర్ మూవీలో చూపించారు. సినిమా టీజర్ విడుదలైనప్పుడు మొదలైన వివాదాలు.. విడుదలై వారం గడుస్తున్నా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే.. అసెంబ్లీ ఎన్నికలకు ముందే సినిమా విడుదలకు సిద్ధమైనా.. అనివార్య కారణాల వల్ల రిలీజ్ కాలేదు. తాజాగా.. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ సినిమా విడుదల కావడం సర్వత్రా చర్చనీయాశంగా మారింది. తెలంగాణ ప్రాంత ప్రజలు అనుభవించిన నరకం.. మరిగిన రక్తంలో నుంచి పుట్టిన ఉద్యమాన్ని కళ్లకు కట్టినట్టు చూపిన ఈ సినిమా.. పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే కొన్ని వర్గాల నుంచి మాత్రం వ్యతిరేకత వస్తోంది. ఈ క్రమంలోనే.. సినిమా నిర్మాత గూడూరు నారాయణ రెడ్డికి బెదిరింపు కాల్స్ వస్తుండటం కలకలం రేపుతోంది. బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డికి ఇప్పటివరకు దాదాపు 1,100 బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ఆయన కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో.. అప్రమత్తమైన కేంద్ర హోం శాఖ ఆయనకు 1+1 సీఆర్పీఎఫ్ జవాన్‌లతో సెక్యూరిటీని నియమించింది. దీంతో.. ఈ అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ముస్లింలకు వ్యతిరేకంగా తీసిన సినిమాగా విమర్శలు వస్తుండటం.. అలాంటి ఒక సినిమా ప్రొడ్యూసర్‌కు కేంద్రం సెక్యూరిటీని నియమించడం.. ఇప్పుడు చర్చకు తెరలేపింది. ఈ సినిమాకు యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించగా.. ప్రముఖ నటి ఇంద్రజ, యాంకర్ అనసూయ కీలక పాత్రలో నటించారు.
Recent Comments