కాంగ్రెస్ వర్సెస్ కారు.. కమలం వర్సెస్ కాంగ్రెస్…
రాష్ట్రమంతా ప్రధానపార్టీల టగ్ ఆఫ్ వార్..
పొన్నం, బండి ఢీ అంటే ఢీ.. సర్కార్, కారు బాహాబాహి…
మేడగడ్డ సందర్శనలతో వేడెక్కిన రాజకీయం..
స్పాట్ వాయిస్, బ్యూరో : రాష్ట్రంలో రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆరోపణలు, ప్రత్యారోపణలతో రెచ్చిపోయిన నాయకులు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల వేళ మరింత రెచ్చిపోతున్నారు. ప్రతి అవకాశాన్ని ప్రయోజనంగా మలుచుకోవడానికి శతథా యత్నిస్తున్నట్టు అర్థమవుతోంది. ఈ క్రమంలోనే మేడిగడ్డ కేంద్రంగా అటు తెలంగాణ సర్కార్, ఇటు బీఆర్ఎస్ పోటీపడి మరీ అస్త్రాలు ఎక్కుపెట్టుకుంటుంటే, రాముడి పై విమర్శలు చేశారని అటు బండి వర్సెస్ పొన్నం ఫైట్ షురూ చేశారు. ఇద్దరు నేతల ఘాటు విమర్శలతో ఇప్పుడు ఆ లొల్లి కాస్త బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. మొత్తంగా మూడు ప్రధాన పార్టీలు రోజుకో కొత్త టాపిక్ తో హాట్ హాట్ కామెంట్స్ చేస్తూ రాష్ట్రంలో రాజకీయాలను రగులుస్తున్నాయి.
ట్రయాంగిల్ హేట్ స్టోరీ..
కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరం ప్రధాన కేంద్రంగా మేడిగడ్డ లోపాలను ఎత్తిచూపుతున్న తీరు ప్రజలంతా గమనిస్తున్నదే. దీంతో మొన్నటి వరకు కొంత స్వీయ న్యూనతలో పడిన బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిదాడికి దిగింది. మేడిగడ్డ కాళేశ్వరంలో ఒక భాగం మాత్రమే అని దానినే అతి పెద్దదిగా చూపుతున్న తీరుపై బీఆర్ఎస్ గళం లేపుతోంది. తమ సర్కార్ చేయకూడని తప్పిదమేదో చేసి ప్రజా ధనాన్ని మొత్తం నొక్కేసినట్టు రేవంత్ అండ్ టీం చేస్తున్న అతి ఏ మాత్రం సరికాదని ప్రతిదాడికి దిగుతోంది. ఈ క్రమంలోనే వచ్చే నెల 1వ తేదీన మేడిగడ్డ సందర్శనకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంది.
అలాగే రాముడిపై మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడని పేర్కొంటూ ఎంపీ బండి సంజయ్ మంత్రిపై చేసిన ఆరోపణలు కూడా తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలోనే విజయ సంకల్ప యాత్రలో బండిని ప్రతిఘటిస్తూ కాంగ్రెస్ శ్రేణులు టమోటాలు, కోడిగుడ్లు విసరడం మరింత ఉద్రిక్తతకు దారితీస్తోంది. ఇలా ఆ మూడు పార్టీలు ఒకదానిపై మరొకటి విరుచుకుపడుతూ కాకపుట్టిస్తున్నాయి.
రాష్ట్రమంతా ప్రధానపార్టీల టగ్ ఆఫ్ వార్..
రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ప్రధాన పార్టీలన్నీ రంగంలోకి దిగాయి. ఎవరికి వారుగా పార్టీ నేతలు ప్రచారంలోకి దిగారు. ఈ క్రమంలోని గతాలను తవ్వకుంటూ దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై గట్టిగానే విరుచుపడుతున్నాడు. ముఖ్యమంత్రి మాటలు ప్రజాస్వామ్యయుతంగా లేవని, ఆ స్థానం వ్యక్తిలో మరింత పరిణతి రావాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా ఫైర్ అవ్వడం మరింత చర్చకు ఆజ్యం పోస్తోంది. మేడిగడ్డను సాకుగా చూపడం కాదు, నిజంగా రేవంత్ మగాడే అయితే రాష్ట్రంలోని 17 కు 17 లోక్ సభ స్థానాలను గెలవాలని సవాల్ విసరడంతో వేడి ఇంకా పెరిగింది. ఇలా ఎవరికి వారుగా తమతమ శస్త్రాలను ఎక్కుపెట్టుకుని ప్రజల్లోకి వెళ్లడానికి పోటీ పడుతున్నారు. రాష్ట్రం మొత్తంగా ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ గొంగడి కప్పుకుని గుద్దుకుంటున్నాయి. ముసుగు తీయకుండా తన్నుకుంటున్నాయి. ఎవరు ఎవరిని ఎందుకు అంటున్నారో ప్రజలంతా నిశితంగా పరిశీలిస్తున్నారనే స్పృహలోనైనా కాస్తోకూస్తో ప్రజప్రయోజనాల కోసం పనిచేస్తారో లేదో చూడాలి మరి..
Recent Comments