ఆయన ఓ ట్రెండ్ సెట్టర్.
రోల్ మోడల్.
బక్కపల్చని మనిషి పండ్లపుల్లేసుకుని రోడ్లెంటా వెళ్తే ఓ సంచలనమే.
మంచంలో కూర్చోని గడ్డం గీసుకున్నా ఓ ప్రత్యేకమే.
స్పాట్ వాయిస్, డెస్క్: ప్రత్యేక రాష్ట్రం కోసం పచ్చి మంచినీళ్లు ముట్టక, చావు వరకు వెళ్లొచ్చిన ఆ సారే., ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి కంటికి కనిపించని రోజులూ తెలిసిందే. ఉద్యమనేతగా కీర్తిని, ప్రజానాయకుడిగా (పదేళ్ల తరువాత) అపకీర్తిని మూటగట్టుకున్నా ఆయనకే చెల్లింది. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి కూడా వెళ్లడానికి ఇష్టపడని ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యకరమే. తిట్టినప్పుడు పడతాడు., పొగిడినప్పుడు నవ్వుతాడు. ఇప్పుడు రోడ్డు షోలతో తన ప్రత్యేకతను మరోమారు చాటుతున్నారు. ఖమ్మం వెళ్తుండగా సారు సడెన్ గా వాహనాన్ని ఆపి ఓ చిన్న హోటల్ కు వెళ్లడం ఊహించని సంచలనమే. మొన్నటి వరకు ముఖం కూడా చూపించని పెద్దాయన ఒక్కసారిగా సాధారణ వ్యక్తిమాదిరిగా మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజీ తండా రోడ్డు పక్కనున్న హోటల్ కు వచ్చి మిర్చి, భజ్జీ తిన్న తీరు ప్రస్తుత రాజకీయ రణరంగంలో వెరీ హైలైట్. ఈయన మా కేసీఆర్ సారేనా అని ప్రత్యక్షంగా తిలకించిన వారికి కొంత సమయం పట్టొచ్చుగాకా, కానీ కళ్లను నలుపుకుని, చర్మాన్ని గిల్లుకుని ఇది ముమ్మాటికి కల కాదు, నిజమని పరవశించారు. తమ నిజమైన నేత ఇన్నాళ్లకు ప్రత్యక్షమయ్యాడని, మధ్యలో ఆయనను ఆవహించిన ‘అపరిచితుడు’ పారిపోయాడని సంబురపడుతున్నారు. కేసీఆర్ సారా.. మజాకా.. ఆయన నిజంగా శ్రద్ధపెడితే ఇలాంటివి ఇంకెన్నో… కదా…
Recent Comments