Saturday, November 23, 2024
Homeలేటెస్ట్ న్యూస్కవితకు మరో 3రోజులు కస్టడీ

కవితకు మరో 3రోజులు కస్టడీ

కవితకు మరో 3రోజులు కస్టడీ
ఇది రాజకీయ కేసు.. న్యాయ పోరాటం చేస్తా
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
స్పాట్ వాయిస్, బ్యూరో: ఢిల్లీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగిసింది. విచారణ నిమిత్తం గతంలో వారం రోజుల పాటు కోర్టు ఇచ్చిన కస్టడీ శనివారంతో ముగియడంతో మరోసారి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఆమెను అధికారులు హాజరుపరిచారు. కవితను మరో 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించిన ఈడీ న్యాయవాది, కస్టడీ పొడిగిస్తే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు మరికొందరిని కవితతో కలిసి విచారించనున్నట్లు చెప్పారు. కవిత న్యాయవాదులు, ఇటు ఈడీ న్యాయవాదుల వాదనాలు విన్న కోర్టు ఆమె కస్టడీని మరో మూడు రోజులు పొడిగిస్తూ తీర్పు వెలువరించింది. ఈ నెల 26వ తేదీ వరకు ఆమె ఈడీ కస్టడీలో ఉండనున్నారు. ఈడీ అధికారులు ఐదు రోజుల కస్టడీని కోరగా రౌస్ అవెన్యూ కోర్టు మూడ్రోజుల కస్టడీకి మాత్రమే అనుమతించింది.

వివరాలు చెప్పడం లేదు..
కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించిన ఈడీ న్యాయవాది కవిత కుటుంబ సభ్యులకు సంబంధించి వివరాలు వెల్లడించలేదని చెప్పారు. కుటుంబ సభ్యుల వ్యాపార లావాదేవీలపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. మద్యం కేసులో సమీర్ మహేంద్రును విచారించాల్సి ఉందని, మేకా శరణ్ నివాసంలో సోదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆయన దర్యాప్తునకు సహకరించడం లేదని వెల్లడించారు. ఇక మద్యం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఇప్పటికే కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. కేజ్రీవాల్ , కవితను ఒకేసారి ప్రశ్నించే యోచనలో ఈడీ అధికారులు ఉన్నారు. ఇద్దరినీ కలిపి ప్రశ్నించేందుకు కవిత కస్టడీ పొడిగింపు కోరగా కోర్టు అనుమతించింది.
కవిత బంధువుల ఇండ్లలో..
మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు పెంచింది. హైదరాబాద్​లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేస్తున్నారు. శనివారం ఉదయం నుంచి ఆమె భర్త అనిల్ కుమార్ బంధువుల నివాసాల్లోనూ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. మాదాపూర్‌లోని డీఎస్​ఆర్ రేగంటి అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న కవిత దగ్గర బంధువు అఖిల ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.

రాజకీయ కేసు..
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ విచారణపై ఎమ్మెల్సీ కవిత అసహనం వ్యక్తంచేశారు. ఏడాది నుంచి అడిగిన వివరాలే మళ్లీమళ్లీ అడుగుతున్నారని చెప్పారు. ఇది రాజకీయ కేసు అని, తప్పుడు కేసని, ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసన్నారు. తన అరెస్టు పూర్తిగా చట్ట విరుద్ధమని తెలిపారు. కోర్టులో న్యాయపోరాటం చేస్తామన్నారు. కస్టడీ ముగియడంతో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తనను ఈడీ అధికారులు అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు. తనపై పెట్టిన కేసులపై న్యాయపోరాటం చేస్తానని వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments