Sunday, May 19, 2024
Homeకెరీర్త్వరలో మెగా డీఎస్సీకి చర్యలు

త్వరలో మెగా డీఎస్సీకి చర్యలు

టీచరు పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి
అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
స్పాట్ వాయిస్, హైదరాబాద్ : తెలంగాణాలో మెగా డీఎస్సీ ద్వారా టీచర్ల భర్తీకి చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సంబంధిత అధికారులతో విద్యాశాఖపై సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణలోని బడి లేని గ్రామ పంచాయతీ ఉండొద్దని, చాలా చిన్న గ్రామమైన, మారుమూల తండా అయినా తప్పకుండా పాఠశాల ఉండాల్సిందేనని, అక్కడ నుంచి ఎవరూ సమీప గ్రామాలు, పట్టణాలకు వెళ్లే పరిస్థితి ఉండొద్దన్నారు. ముఖ్యంగా విద్యార్థులు లేకుండా మూసివేసిన అన్ని పాఠశాలలను వెంటనే తెరిపించాలని, ఎంతమంది పిల్లలున్నా స్కూల్ నడిపించాల్సిందేనన్నారు. ఇందు కోసం వెంటనే మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల భర్తీకి చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి డీఎస్సీని నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవాలనిన్నారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో జరిగిన పనుల పురోగతిని సమీక్షించారు. కార్యక్రమంలో ఇంకా మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తి చేసి, రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దాలన్నారు. ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలలో ఉన్న అవాంతరాలపై దృష్ఠిసారించాలని సీఎం ఆదేశించారు.

ఉమ్మడి జిల్లాకో స్కిల్ యూనివర్సిటీ
రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లో స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో ప్రారిశ్రామిక అవసరాలకు కావాల్సిన నైపుణ్యం గల ఉద్యోగాలను సాధించేలా స్కిల్ యూనివర్సిటీలుండాలన్నారు. వీటిలో ఉపాధి ఆధారిత స్వల్పకాల, దీర్ఘ కాల కోర్సులను ప్రవేశ పెట్టాలని పేర్కొన్నారు. ఈ విషయంలో గుజరాత్, హర్యానా, రాజస్థాన్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న స్కిల్ యూనివర్సిటీలని అధ్యయనం చేయాలన్నారు. ఇందుకు విద్యాశాఖ, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖల కార్యదర్శులతో ప్రత్యేక కమిటీ వేసి తగు ప్రతిపాదనలను సమర్పించాలని సీఎస్‌ను ఆదేశించారు. సమావేశంలో సీఎస్‌ శాంతి కుమారి, ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రొఫెసర్‌ లింబాద్రి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments