ఇంటికి వెళ్తూ నవ దంపతులు..
ఊరికెళ్తూ అన్నాచెల్లి..
బీసీ లోన్ కోసం వెళ్లి వస్తూ ఒకరూ
పెళ్లికెళ్తూ మరొకరు
ప్రమాద స్థలిలోనే మరణం
స్పాట్ వాయిస్, నెట్ వర్క్: ఎంత ఘోరం.. ఒక్క రోజే రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. పెళ్లి అయిన నేటికీ సరిగ్గా మూడునెలలే అవుతున్న నవదంపతులు.. ఇంటికెళ్తుండగా.. లారీ ఢీకొట్టింది. నూరేళ్ల దాంపత్యం మూడు నెలలకే ముగిసింది. ఇక కరుణాపురం-రాంపూర్ మధ్య ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై లారీని ఢీకొని అన్నచెల్లెలు మృతి చెందారు. వారి తండ్రి సైతం గతంలో ఔటర్ రోడ్డుపై మరణించాడు. వీరిద్దరు హైదరాబాద్ లో జాబ్ చేస్తూ తల్లి చూసేందుకు వచ్చారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ వెళ్తుండగా.. లారీని ఢీకొని అక్కడికక్కడే చనిపోయారు. భూపాలపల్లి జిల్లా మహాముత్తారంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం అలుముకున్నది.
అన్న చెల్లెలు..
ఘోర రోడ్డు ప్రమాదం అన్నాచెల్లిని మింగేసింది. ఈ ఘటన కరుణాపురం- రాంపూర్ మధ్యనున్న ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి బైక్ ఢీకొట్టిగా, బైక్ పై వెళ్తున్న అన్నాచెల్లెలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు హసన్ పర్తి మండలం నాగారం గ్రామానికి చెందిన సుమిత్ రెడ్డి, పూజిత రెడ్డిగా పోలీసులు గుర్తించారు. ధర్మసాగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహలను ఎంజీఎం మార్చురీకి తరలించారు.
టాటా ఎస్, టూ వీలర్ ఢీ..
ఇద్దరూ స్పాట్ డెడ్
మహాముత్తారం మండలం దొబ్బలపాడు- కొర్లకుంట గ్రామాల వద్ద మేడారం మెయిన్ రోడ్డుపై శుక్రవారం ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం, టాటా ఏస్, కారు ఒకేసారి ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని కొర్లకుంటకు చెందిన చేరాల అశోక్ (32), గోదావరిఖని పట్టణంలోని అడ్డగుంటపల్లికి చెందిన చిల్ల సమ్మక్క(65) అనే మహిళ స్పాట్ లోనే చనిపోయారు. టాటా ఎస్ డ్రైవర్ ఊర శ్రీశైలం కాలు విరిగింది. మోటం రాజేశ్వరి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కు తరలించారు.
బీసీ లోన్ కోసం వెళ్లి..
కొర్లకుంటలో కటింగ్ షాప్ నడుపుకుంటాడు. తన భార్యతో కలిసి మహాముత్తారం వెళ్లి మీ సేవలో బీసీ లోన్ కోసం అప్లై చేసుకునేందుకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో తన భార్యను వేరే వాహనంలో ఎక్కించి బయలుదేరాడు. ఈ క్రమంలో గూడ్స్ ట్రాలీని ఢీ కొట్టి మృతి చెందాడు.
బంధువుల పెళ్లికి వెళ్తూ..
చిల్ల సమ్మక్క కుటుంబం గోదావరిఖని నుంచి మంగపేటకు తన బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్తున్నారు. ఈ క్రమంలో యాక్సిడెంట్ జరిగింది. ఈ గూడ్స్ ట్రాలీలో ప్రయాణిస్తున్న ఊర శ్రీశైలం డ్రైవర్ కాలు విరగగా పెంట రాజేశ్వరి తీవ్రంగా గాయపడింది. వీరిని 108లో చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు.
చలించిన హృదయం..
మహాముత్తారం మండలం కొర్లకుంట గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అయితే ఇదే సమయంలో మహాముత్తారం పర్యటనలో భాగంగా అటువైపు వెళ్తున్న బీఆర్‌ఎస్‌పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జ్, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ ఫుట్ట మధూకర్ ఆ ప్రమాదాన్ని చూసి చలించిపోయారు. వెంటనే తన వాహనాన్ని ఆపి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదంలో కొర్లకుంట గ్రామానికి చెందిన వ్యక్తి, గోదావరిఖనికి చెందిన మరోమహిళ మృతి చెందినట్లు గుర్తించారు. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్న జెడ్పీ చైర్మన్ పోలీసులతో మాట్లాడారు. మృతదేహాలకు పోస్టుమార్టం త్వరగా నిర్వహించి బంధువులకు అప్పగించాలని సూచించారు.
నవ దంపతులు మృతి
మరిపెడ మండలం తానంచెర్ల వద్ద 365 జాతీయ రహదారిపై లారీ బైక్ ను డీకొట్టిన ఘటనలో నవ దంపతులు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె కు చెందిన నారాయణ (27), మరిపెడ బంగ్లాకు చెందిన అంజలి (25) కు సరిగ్గా మూడు నెలల క్రితమే వివాహం జరిగింది. నారాయణ హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తుంటూ జీవనం గడుపుతున్నారు. శుక్రవారం దంపతులిద్దరు హైదరాబాద్ నుంచి మరిపెడకు బైక్ పై వస్తున్నారు. ఈ క్రమంలో మరిపెడ మండలం తానంచెర్ల వద్ద 365 జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తు్న్న ద్వి చక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యా భర్తలు అక్కడికికక్కడే మృతి చెందారు. విషయ తెలుసుకున్న మరిపెడ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై మరిపెడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు ఎస్సై దూలం పవనకుమార్ తెలిపారు.
Recent Comments