Sunday, November 24, 2024
Homeరాజకీయంకాంగ్రెస్ ను టచ్ చేస్తే మసే..

కాంగ్రెస్ ను టచ్ చేస్తే మసే..

కేసీఆర్‌వి పిట్టల దొర ముచ్చట్లు..
బీఆర్ఎస్ అభ్యర్థి దుర్మార్గుడు
కారు కార్ఖానాకు పోయింది…
మోడీ ఎన్ని నిధులిచ్చాడు..
రఘునందన్ రావు సమాధానం చెప్పాలి..
పేదింటి బిడ్డ నీలం మధు..
గెలిపించుకునే బాధ్యత మీదే..
బీఆర్ఎస్, బీజేపీలు ఎవరికి టికెట్లు ఇచ్చాయో ఆలోచించాలే
మెదక్ సభలో సీఎం రేవంత్ రెడ్డి
స్పాట్ వాయిస్, బ్యూరో: కాంగ్రెస్‌ సర్కారు పథకాలు చూసి కేసీఆర్‌ కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. పిట్టల దొరలా మారి, కేసీఆర్‌ ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో మెదక్‌ జిల్లాకు ఒక్క పరిశ్రమైనా వచ్చిందా? అని ప్రశ్నించారు. అలాగే దుబ్బాకకు మోడీ ఇచ్చిన నిధులెన్నో రఘునందన్ రావు చెప్పాలని సవాల్‌ చేశారు. ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పునరుద్ఘాటించారు. వచ్చే వరి పంటకు రూ.500 బోనస్‌ ఇచ్చి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. మోడీ, కేసీఆర్‌, మెదక్ ప్రాంతాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ప్రజల కష్టాలు నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్‌ పార్టీ తీసుకుంటుందని అన్నారు.


వెంట్రామ్ రెడ్డి దుర్మార్గుడు
బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఒక దుర్మార్గుడు కాదా? అని సీఎం ప్రశ్నించారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల భూములను లాక్కున్న వ్యక్తి వెంకట్రామిరెడ్డికి బీఆర్ఎస్ ఎంపీ టిక్కెట్ ఇచ్చిందని తెలిపారు. ఈ ప్రాంతానికి కష్టపడి పని చేస్తున్నటువంటి మదన్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోవడంపై ఒకసారి ఆలోచన చేయాలన్నారు. కేసీఆర్ కనీసం ముదిరాజులను డీ గ్రూపు నుంచి ఏ గ్రూపులోకి మార్చేందుకు కనీస ప్రయత్నమైనా చేశారా? అని ప్రశ్నించారు.


మాడి మసైపోతారు..
హస్తం పార్టీపై చెయ్యి వేస్తే మాడి మసైపోతారని ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పేదలకు ఎప్పుడూ అండగా నిలబడేది మూడు రంగుల జెండానేనని, కాంగ్రెస్‌ను అఖండ మెజార్టీతో గెలిపించి రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయాలని రేవంత్‌ కోరారు. రాష్ట్రంలో రూ.22,500 కోట్లతో 4.5లక్షల ఇళ్లు నిర్మించాలని ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం ప్రారంభించామని తెలిపారు. పేదోడికి సొంత ఇల్లు ఉంటే గౌరవంగా జీవిస్తారని, ఆ దిశగానే తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించి, ఇచ్చే ఇళ్లను రద్దు చేయాలని ఢిల్లీలో ఉండే మోడీ, గజ్వేల్‌లో ఉండే కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. పేదవాడి కళ్లలో ఆనందం చూసి ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రధాని మోసం చేశారని ఆక్షేపించారు. మీ బ్యాంకు ఖాతాల్లో రూ.15లక్షలు వేస్తామన్నారు. మరి ఒక్క రూపాయి అయినా వేశారా అని ప్రశ్నించారు. ఢిల్లీలో రైతులను చంపిన బీజేపీని బొంద పెట్టాలన్నారు.
పేద ముదిరాజ్‌ బిడ్డకు మెదక్‌ టికెట్ ఇచ్చాం
కాంగ్రెస్‌ కష్టాల్లో ఉన్నప్పుడు మెదక్‌ ప్రజలు ఇందిరమ్మను గెలిపించారని సీఎం అన్నారు. ఇందిరాగాంధీ హైదరాబాద్‌కు అనేక పరిశ్రమలు కేటాయించారని, బీహెచ్‌ఈఎల్‌, బీడీఎల్‌, ఇక్రిశాట్‌ను ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. కాంగ్రెస్ పేద ముదిరాజ్‌ బిడ్డకు ఎంపీ టికెట్‌ ఇచ్చిందని, గెలిపించే బాధ్యత మీదేనని విజ్ఞప్తి చేశారు. 1999 నుంచి 2024 వరకు 25 ఏళ్లు బీజేపీ, బీఆర్ఎస్ చేతుల్లోనే ఈ పార్లమెంట్ ఉందని, ఈ ఒక్కసారి ఆలోచన చేసి కాంగ్రెస్ ఓటు వేయాలని అభ్యర్థించారు. ముదిరాజ్ , సబ్బండ బిడ్డలంతా ఏకమై ఎంపీ అభ్యర్థి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
నీలం మధు గెలుపు ఖాయం..
మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలుపు ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నామినేషన్ , మీటింగ్ వచ్చిన అశేష జనాల్లో ఉత్సాహం, ఊపును చూస్తే అభ్యర్థి నీలం మధు గెలుపు పై తనకు నమ్మకం కలిగిందన్నారు. పేదింటి బిడ్డ నీలం మధుకు కాంగ్రెస్ పార్టీ అరుదైన అవకాశం ఇచ్చిందని సీఎం పేర్కొన్నారు. అదే మెదక్ నుంచి బీఆర్ఎస్, బీజేపీలు ఎవరికి టికెట్లు కేటాయించాయో ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఈ ప్రాంతానికి ఎన్ని నిధులు, ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చారో? లెక్క చెప్పాలని ప్రశ్నించారు. దేశంలో మోడీ పీఎం గా ఉండి కూడా ఈ ప్రాంత అభివృద్ధికి చేసిందేమిటో? చూపాలన్నారు. పీఎం మోడీ, మాజీ సీఎం కేసీఆర్ మెదక్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది ఏమీ లేదన్నారు. ఇప్పుడు సిగ్గు లేకుండా అబద్ధపు మాటలతో ఓట్లు అడగడానికి వస్తున్నారని సీఎం ఘాటుగా విమర్శించారు. మెదక్ ప్రాంతానికి వేలాది పరిశ్రమలు తెచ్చింది కాంగ్రెస్ హయాంలోనే అని గుర్తు చేశారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, ఎమ్మెల్యే రోహిత్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నిర్మల జగ్గారెడ్డి ,మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు, ఆవుల రాజిరెడ్డి, మదన్ రెడ్డి, నర్సారెడ్డి, కాటశ్రీనివాస్ గౌడ్ ,శ్రీనివాస్ రెడ్డి,పూజారి హరి కృష్ణ,ఆంజనేయులు గౌడ్ మెదక్ కాంగ్రెస్ నేతలు, నాయకులు,ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments