తెలంగాణ పరిరక్షణ బాధ్యత కాంగ్రెస్ తీసుకోవాలి
ఎంసీపీఐయూ నర్సంపేట డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజాసాహెబ్
స్పాట్ వాయిస్, నల్లబెల్లి : తెలంగాణ రాష్ట్రాన్ని పరిరక్షించే బాధ్యతను కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలే ప్రధాన ఎజెండాగా ప్రచారం చేసి, అధికారాన్ని చేపట్టిన టీఆర్ఎస్ వాటి అమలును గాలికి వదిలేసిందని ఎంసీపీఐయూ నర్సంపేట డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజాసాహెబ్ ఆరోపించారు.
ఆదివారం నల్లబెల్లిలోని పార్టీ కార్యాలయ ఆవరణలో పార్టీ మండల కార్యదర్శి కామ్రేడ్ దామ సాంబయ్య అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మహమ్మద్ రాజా సాహెబ్ హాజరై మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తరువాత బీఆర్ ఎస్ వారి ఎన్నికల మేనిఫెస్టోను సైతం అమలు పర్చకుండా, ప్రతిపక్ష పార్టీల విమర్శల నుంచి బయటపడడానికి, దళిత బంధు, బీసీ బంధు, గిరిజన బంధు, గొర్రెల, బర్రెల, చేపల పెంపకం లాంటి అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి, అప్పుల రాష్ట్రంగా మార్చిందన్నారు. విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని త్వరితగతిన పరిరక్షించే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుని పనిచేయాలని కోరారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం, పారిశ్రామిక అభివృద్ధిని సమాన ప్రాతిపదికగా చేసుకొని పని చేయాలని, అప్పుడు మాత్రమే సమాజంలో అసమానతలు తగ్గుతాయన్నారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను త్వరితగతిన పూర్తి చేయాలని, వీటి అమలులో ఎలాంటి అవకతవకలు లేకుండా లబ్ధిదారుల ఎంపిక విధానం ఉండాలని, లేకుంటే ప్రజలను చైతన్యపరిచి ఉద్యమ కార్యాచరణను చేపడతామని అన్నారు. సమావేశంలో నాగెల్లి యోసఫ్, త్రికోపోలా శ్రీకాంత్, జన్ను సామెల్, మంద సంజీవ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ పరిరక్షణ బాధ్యత కాంగ్రెస్ తీసుకోవాలి
RELATED ARTICLES
Recent Comments