సమయాన్ని పాటించని ఉద్యోగులు
స్పెషలాఫీసర్ జాడే లేదు..
ఎమ్మెల్యే చొరవచూపాలని కాంగ్రెస్ నాయకుల వినతి
స్పాట్ వాయిస్, మహబూబాబాద్ (డోర్నకల్) : పారిశుద్ధ నిర్వహణ లోపం కారణంగా ఆ గ్రామంలో చెత్త పేరుకుపోయి కంపు కొడుతోందని ఆరోపణలు వస్తున్నాయి. వచ్చామా.. పోయావా అన్నట్లుగా తయారైంది గ్రామ అధికారి తీరు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాండ్ల సంకీస గ్రామంలో గత ఐదు రోజులుగా చెత్త సేకరణ, పారిశుధ్య పనులు జరగడం లేదని కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు గండు బాబు ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సర్పంచుల పాలన ముగియడంతో ప్రభుత్వం గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగిస్తోందన్నారు. అయితే సంకీస గ్రామ స్పెషల్ ఆఫీసర్, కార్యదర్శి పారిశుధ్యాన్ని సక్రమంగా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఈ విషయమై ఇటీవల ఎంపీడీవో కార్యాలయంలో ఫిర్యాదు చేశామని, అయినా ఎలాంటి మార్పు లేదన్నారు. మండలంలో అధిక జనాభా కలిగిన గ్రామంలో ప్రత్యేకాధికారి సక్రమంగా లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలిముద్ర పడని పెన్షన్లు సకాలంలో అందడం లేదని, వీధి దీపాల నిర్వహణ జరగక గ్రామం అంధకారంలో మగ్గుతోందని, మురికి కాల్వలు శుభ్రత పాటించడం లేదని వాపోయారు. వేసవి కాలం సమీపిస్తున్న వేళ ప్రజలకు నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. మండలంలో కొన్ని శాఖల అధికారులు,సిబ్బంది సమయపాలన పాటించడం లేదని, వివిధ పనులపై కార్యాలయాలకు వెళ్లే రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనేకమంది ఉద్యోగులు ఇతర జిల్లాల నుంచి వస్తుండడంతో ప్రజలకు సరైన సమయంలో సరైన సేవలు అందడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యే రామచంద్రనాయక్ అధికారుల సమయపాలను, తమ గ్రామ పారిశుధ్య పనులపై అధికారులకు ఆదేశించాలని కోరారు. సమావేశంలో వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాసం శేఖర్, మండల మైనార్టీ అధ్యక్షులు ఆఫ్జల్ తదితరులున్నారు.
కంపు కొడుతున్న పెరుమాండ్ల సంకీస
RELATED ARTICLES
Recent Comments