Saturday, November 23, 2024
Homeతెలంగాణఆ ఇంటి పిట్ట ఈ ఇంటి మీద వాలితే కాల్చుడే

ఆ ఇంటి పిట్ట ఈ ఇంటి మీద వాలితే కాల్చుడే

ప్రభుత్వాన్ని కూల్చే దమ్ముందా..
ఆ మాట మాట్లాడితే పళ్లు రాలగొట్టుడే..
ప్రభుత్వం పడిపోతుందనే భ్రమలో కేసీఆర్..
సీఎం రేవంత్ రెడ్డి
ఇంద్రవెల్లి సభలో కల్వకుంట్ల కుటుంబంపై ఫైర్
  ‘‘పందికొక్కులు తోటలో పడి విధ్వంసం చేసినట్టు కేసీఆర్ కుటుంబం తెలంగాణను ఆగమాగం చేసింది. మొన్నటి ఎలక్షన్లలో ప్రజలు సాచి కొడ్తే కూడా బీఆర్ఎస్ వాళ్లకు బుద్ధి వస్తలేదు. ఇప్పటికీ మా సర్కార్ కూలబోతోందని.., మళ్లీ కేసీఆర్ సీఎం కాబోతున్నాడనే వాళ్లంతా భ్రమల్లో బతుకుతున్నారు. ఏ రమ్మను… కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవడికుందో…’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇంద్రవెల్లిలో జరిగిన సభలో బీఆర్ఎస్ కి ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సర్కార్ ను కూలగొడ్తం అన్నోని పళ్లు రాలగొడుతామని ఘాటుగా చెప్పారు. ఆ ఇంటి మీద పిట్ట ఈ ఇంటి మీద వాలితే కాల్చి పడేస్తామని, కేసీఆర్ ఖాన్‌దానంతా వచ్చినా పండబెట్టి చీరుతామని హెచ్చరించారు. మేమొచ్చి రెండు నెలలు కాలేదు.. 6 గ్యారంటీలు ఏమయ్యాయని వెటకారమాడుతున్నారన్నారు. తమది ప్రజాశీర్వాదం ఉన్న ప్రభుత్వమని, త్వరలోనే రూ.500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని సీఎం ప్రకటించారు. 
-స్పాట్ వాయిస్, బ్యూరో
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం పూరించారు. అంతేకాదు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. త్వరలోనే రేవంత్ సర్కార్ పడిపోతుందని, మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారంటూ బీఆర్ఎస్‌ నేతలు పలు సందర్భాల్లో చేస్తున్న వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ముందా అంటూ బీఆర్ఎస్ నేతలను రేవంత్ ప్రశ్నించారు. మూడు నెలలకో, ఆరు నెలలకో కేసీఆర్ సీఎం అవుతారని ఎవడైనా అంటే పళ్లు రాలగోడతామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆలోచన వచ్చినోళ్లను గ్రామాల్లో తరిమితరిమి కొట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందా అంటూ సెటైర్లు వేశారు. తమది ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వమని, ప్రజా ప్రభుత్వమని రేవంత్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని భ్రమల్లో, కల్లో కేసీఆర్ ఉన్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అక్రమ సంపాదనతో.. తన ఫాంహౌస్‌కు సీఎం అవుతాడేమో కానీ.. జన్మలో కేసీఆర్ తెలంగాణ మళ్లీ సీఎం కాలేరని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. ఏదైనా పదవి కావాలంటే నిత్యానంద స్వామిలా ఏదైనా దీవి కొనుక్కోవాలంటూ కేసీఆర్‌కు ఉచిత సలహా ఇచ్చారు. ప్రజలకు కేసీఆర్ చేసిన పాపాలకు అంతకంతకూ అనుభవించాల్సిందే అని.. అన్ని వర్గాలను నిట్టనిలువునా మోసం చేసి మళ్లీ సిగ్గు లేకుండా పదవి కావాలని కోరుకోవడం ఏంటంటూ మండిపడ్డారు.
అందిన కాడికి దోచుకున్నారు..
తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం విధ్వంసం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మిషన్ భగీరథ పేరుతో రూ. 40 వేల కోట్లు దోచుకున్నారని, రూ. 7 లక్షల కోట్ల అప్పుల తెలంగాణగా మార్చారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిధులు లేకుండా చేశారని ఆరోపించారు. దోపిడి పాలన కారణంగా, పదేళ్ల దుర్మార్గ పాలనకు ప్రజలు చరమగీతం పాడారని అన్నారు. తెలంగాణ ఏమైనా కేసీఆర్ కుటుంబం కోసం వచ్చిందా? అని వ్యాఖ్యానించారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ సర్కార్ అడవి బిడ్డలను పట్టించుకోలేదని విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగులకు మాత్రం మొండిచేయి చూపిన కేసీఆర్.. తన బిడ్డ కవితను ప్రజలు ఓడించినా ఎమ్మెల్సీతో ఉద్యోగం ఇచ్చారంటూ తీవ్ర విమర్శలు చేశారు.
15 రోజుల్లో కానిస్టేబుళ్ల ఉద్యోగాలు..
15 రోజుల్లో 15వేల కానిస్టేబుళ్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు కోర్టు కేసులు పరిష్కారం అయ్యేలా పని చేస్తున్నామని చెప్పారు. వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 15వేల కానిస్టేబుళ్ల ఉద్యోగాలను కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే 7వేల మంది స్టాఫ్ నర్సులకు ఉద్యోగాలిచ్చామని చెప్పారు సీఎం రేవంత్.
త్వరలోనే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్..
ఇంద్రవెల్లి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అతి త్వరలోనే రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించారు. త్వరలో లక్షమంది మహిళలకు అందిస్తామని చెప్పారు. అంతే కాకుండా.. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని త్వరలోనే అమలు చేస్తామన్నారు. అంతే కాకుండా.. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటానని సీఎం రేవంత్ అన్నారు.
రెండు నెలల్లో ఎలా సాధ్యం..
రెండు నెలలు కాలేదు.. ఇప్పుడే 6 గ్యారంటీలు అమలు చేయలేదంటున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కడెం రిపేర్ చేస్తాం.. సదర్మాట్, కుప్టి నిర్మిస్తామని తెలిపారు. ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చావా అని కేసీఆర్ ను ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని పడగొడుతా అంటున్నారు.. ఎవ్వడు వచ్చేది.. ప్రజల ప్రభుత్వం తమది ప్రజా ప్రభుత్వం అని అన్నారు. కాళేశ్వరం గాలికి పోయింది.. నువ్వు నీ ఖాన్ దాన్ వచ్చినా ఏం చేయలేరని మండి పడ్డారు.  కేసీఆర్ పాలనలో రాష్ట్రాన్ని విధ్వంస రాష్ట్రంగా మార్చారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎవరి చేతుల్లో రాష్ట్రం సురక్షితంగా ఉంటుందో ఆలోచన చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్‌ పదేళ్లలో ఏమీ చేయలేదని, తాము 2 నెలల్లో ఎలా చేస్తాం? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ కు అండగా ఉండాలి..
దేశంలో రెండే రెండు కూటములు ఉన్నాయని.. అందులో ఒకటి మోడీ కూటమి అని, మరొకటి ఇండియా కూటమి అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తమ కూటమిలోకి మాత్రం కేసీఆర్‌ను రానివ్వమని ఇంద్రవెల్లి సభా వేదికగా స్పష్టం చేశారు. బీజేపీకి గానీ, బీఆర్ఎస్ గానీ 6 నుంచి 7 ఎంపీ సీట్లు వస్తే రాష్ట్రాన్ని మళ్లీ మోడీకి అమ్ముకుంటారని రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో హామీ ఇచ్చినట్టుగా.. ప్రధాని మోడీ ఎవరి ఖాతాలోనైనా 15 లక్షలు వేశారా అంటూ రేవంత్ ప్రశ్నించారు. మతం పేరుతో ఒకరు.. మద్యం పేరుతో మరొకరు వస్తారు.. ప్రతీ తండా, గూడెం లలో రోడ్లు వేసే బాధ్యత తమదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే ఆదిలాబాద్ ఎంపీ సీటు గెలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments