Monday, May 20, 2024
Homeటాప్ స్టోరీస్మేడిగడ్డ పనుల్లో విస్తుపోయే నిజాలు..

మేడిగడ్డ పనుల్లో విస్తుపోయే నిజాలు..

విజిలెన్స్ విచారణలో వెలుగుచూస్తున్న వైనం..
మొదటి వరదకే పగుళ్లంటా…
అంచనా రూ.2591 కోట్లు అయితే..
పనులు చేసింది.. రూ.4613 కోట్లతో..
స్పాట్ వాయిస్, మహాదేవపూర్: కాళేశ్వరం ప్రాజెక్టులో విచారణ చేస్తున్న కొద్ది అక్రమాలు, నిర్లక్ష్యపు పనులు వెలుగు చూస్తున్నాయి. ప్రతీ పనిలోనూ లోపం కనిపిస్తోంది. విజిలెన్స్ నివేదిక సిద్ధమవుతుండగా విస్తుపోయే నిజాలు తెలుస్తున్నాయి. వరదల కారణంగా మేడిగడ్డ డ్యామేజ్ కాలేదని మానవ తప్పిదం వల్లే బ్యారెజ్ దెబ్బతిందని విజిలెన్స్ అధికారులు అంచనాకువచ్చారు. కాంక్రీట్, స్టీల్ నాణ్యత లోపం గుర్తించిన విజిలెన్స్ ఒకటి నుంచి ఐదో పిల్లర్ వరకు పగుళ్లు ఉన్నట్లు పేర్కొన్నారు. 2018 నుంచి మేడిగడ్డలో జరిగిన నిర్మాణంపై శాటిలైట్ డేటాను విజిలెన్స్ సేకరిస్తోంది. ఇక మేడిగడ్డ డిజైన్ కు, నిర్మాణానికి తేడాలు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు.. బ్యారేజ్ ప్రారంభమయ్యాక వచ్చిన మొదటి వరదకే పగుళ్లు వచ్చాయని, వాటిని రిపేర్ చేయాలని ఎల్ అండ్ టీ కి లేఖ రాస్తే అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదని గుర్తించారు. ఇక ప్రాజెక్ట్ సంబంధించిన అనేక ప్రాజెక్టులు మిస్ అయినట్లు అధికారులు గుర్తించారు.

కాఫర్ డ్యాం తీయలే..
మేడిగడ్డ ఆనకట్టలో ఒప్పందం ప్రకారం చేయాల్సిన కొన్ని పనులను కాంట్రాక్ట్ సంస్థ చేయకుండానే వదిలేసినట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నిర్ధారించింది. ఇలా వదిలేసిన పనులకు బిల్లులు చేసుకున్నారన్న అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకు వివరాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. మేడిగడ్డ బ్యారేజీ పని సమయంలో నీటిని మళ్లించేందుకు నిర్మించిన కాఫర్‌ డ్యాం (మట్టికట్ట)ను ఒప్పందం ప్రకారం తొలగించలేదని, ఎం.బుక్‌లో మాత్రం తొలగించినట్లు రికార్డు చేశారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఫలితంగా దీనికి వినియోగించిన ఇసుక, మట్టి, షీట్‌ పైల్స్‌ వరద సమయంలో కొట్టుకుపోయి ఆనకట్ట వద్ద అడ్డుపడటంతో నీటి ప్రవాహంలో మార్పు వచ్చినట్లు విజిలెన్స్‌ భావిస్తోంది. ఇనుప షీట్‌పైల్స్‌ బ్యారేజీ దగ్గర పడి ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన ఇసుకను 88 మీటర్ల వద్ద లెవెల్‌ చేయాలని, కానీ అలా చేయకుండా వదిలేయడం వల్ల గుట్టలుగా పేరుకున్న ఇసుక కూడా నీటి ప్రవాహంపై ప్రభావం చూపి ఉండవచ్చన్న కోణంలోనూ విజిలెన్స్ అధికారులు విశ్లేషణ చేస్తున్నారు.

డబుల్ అయిన వ్యయం
మరోవైపు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం కోసం అంచనాల్లో పేర్కొన్న పనులు, వాటి విలువ, చేసిన పని, విలువ తదితర వివరాలను విజిలెన్స్‌ అధికారులు సేకరించారు. ఈ ఆనకట్ట నిర్మాణానికి 2016 మార్చి 1న రూ.2591 కోట్లకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బ్యారేజీ, గేట్ల నిర్మాణం, బ్యారేజీకి రెండువైపులా గైడ్‌ బండ్స్‌ నిర్మించడానికి ఈ మొత్తం ఖర్చవుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. తర్వాత రెండు నెలలకే ఆనకట్ట నిర్మాణ వ్యయం రూ.3260 కోట్లుగా పేర్కొంటూ 2016 మే 19న సర్కార్ మరో ఉత్తర్వు ఇచ్చింది. 2021 సెప్టెంబరు 6న మళ్లీ ఈ మొత్తాన్ని సవరించి రూ.4613 కోట్లుగా పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసింది. పని ప్రారంభించి పూర్తయ్యేలోగా వ్యయం రూ.2022 కోట్లు పెరిగింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments