భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే
స్పాట్ వాయిస్, గణపురం: ‘ఓటు ఎంతో పవిత్రమైనది, దాన్ని స్వేచ్ఛగా వినియోగించుకోండి, మేము మీకు భరోసాగా ఉంటాం’ అని భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. శనివారం గణపురం మండల కేంద్రంలోని చెంచు కాలనీ వాసులతో సమావేశం నిర్వంహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఓటర్లలో నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించడానికి, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికలలో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు, డబ్బులకు, కానుకలకు లొంగక, తమ మనసాక్షి మేరకు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని అన్నారు. ప్రజలు, రాజకీయ పార్టీలు ప్రతి ఒక్కరూ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించాలని, ఆటంకం కలిగించే చర్యలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎవరైనా ప్రలోభాలకు గురి చేస్తే 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. అనంతరం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అలాగే పోలీసు స్టేషను విజిట్ చేసి రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఆయన వెంట ఎస్సై మచ్చ సాంబమూర్తి, సిబ్బంది ఉన్నారు.
Recent Comments