పోలీసులపై చేయిచేసుకున్న వైఎస్ షర్మిల, విజయమ్మ
స్పాట్ వాయిస్, హైదరాబాద్: హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లోని వైఎస్ షర్మిల ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో సిట్ అధికారులను కలిసి వినతి పత్రం ఇచ్చేందకు బయలు దేరిన ఆమెను పోలీసులు అడ్డుకోవడంతో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. షర్మిల కారు ఎక్కే సమయంలో అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీస్‌పై షర్మిల చేయి చేసుకున్నారు. ఈ క్రమంలో షర్మిలకు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు అడ్డుకోవడంతో షర్మిల రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
షర్మిల అరెస్ట్
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో సోమవారం సిట్ అధికారులకు మెమోరాండం ఇవ్వాలని వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల భావించారు. అందులో భాగంగా ఉదయం 10:30 గంటలకు లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలయం నుంచి షర్మిల బయలుదేరుతుండగా పోలీసులు పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. బయటకు వెళ్లేందుకు అనుమతిలేదని అడ్డుకుకున్నారు. అయితే షర్మిల పోలీసులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా పోలీసులు వినిపించుకోలేదు. ఒక పార్టీ అధ్యక్షురాలిపట్ల పోలీసుల తీరు సరిగా లేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కానిస్టేబుళ్లను పెట్టలేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఆమెను తోసివేసే ప్రయత్నం చేయడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన షర్మిల రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తన తప్పులేకపోయినా పోలీసులు తనపై ప్రవర్తించిన తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విధుల్లో ఉన్న ఎస్సై, కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నందుకు షర్మిలపై ఐపీసీ 330, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ఈ ఘటనపై వైఎస్సార్టీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.
విజయమ్మ సైతం..
జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అరెస్ట్ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వైఎస్ విజయమ్మ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈక్రమంలో ఓ మహిళా కానిస్టేబుల్‌పై ఆమె చేయిచేసుకున్నారు. షర్మిలను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. పోలీసుల తీరుపై కోర్టుకు వెళ్లనున్నట్లు విజయమ్మ తెలిపారు. చివరకు విజయమ్మను పోలీసులు బలవంతంగా కారులో ఎక్కించి అక్కడి నుంచి పంపించి వేశారు.
Recent Comments