Sunday, November 24, 2024
Homeతెలంగాణచావును ఆహ్వానించిన డాక్టర్..

చావును ఆహ్వానించిన డాక్టర్..

లంగ్ క్యాన్సర్ కన్ఫర్మ్ అయ్యాక భార్యకు విడాకులు
అమ్మానాన్నకు ధైర్యం చెప్పాడు..
ముందే అన్ని ఏర్పాట్లు చేసుకున్న హర్షవర్దన్
రెండు రోజుల క్రితం మృతి..
కన్నీళ్లు పెట్టుకుంటున్న జనాలు
వైద్యుడి పెద్దమనస్సుపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ

స్పాట్ వాయిస్, ఖమ్మం: ఆయన వృత్తి రీత్యా డాక్టర్. సొంతూరు ఖమ్మం. పేరు హర్షవర్ధన్. యంగ్ పర్సన్. పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. వైరా సమీపంలోని తన మేనత్త ఊరికి చెందిన సింధు అనే అమ్మాయిని ఇష్టపడ్డాడు. 12 ఫిబ్రవరి 2020న పెద్దల సమక్షంలో వివాహాం చేసుకున్నాడు. వారం రోజులు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లాడు. ఇదే నెల చివరన ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అక్కడ ఓ ఆసుపత్రిలో వైద్యుడిగా కుదురుకున్నాడు. ఏప్రిల్ లో భార్యను అక్కడికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ ప్రపంచాన్ని కరోనా ఆవహించింది. అంతటా లాక్ డౌన్. భార్య ఆస్ట్రేలియాకు వెళ్లలేకపోయింది. చేసేదేం లేక హర్షవర్ధన్ అక్కడే ఉండిపోయాడు. స్వయంగా వంట చేసుకునేవాడు. బయట ఆహారం తీసుకునేవాడు కాదు. ఆరోగ్యం పట్ల ఆయనకు ప్రత్యేక శ్రద్ధ. బాడీని ఫిట్ గా ఉంచుకోవడమంటే ఇష్టం. అంతబాగానే నడుస్తుంది అనుకుంటున్న సమయంలో పిడుగులాంటి వార్త. తాను వ్యయామం చేస్తున్నప్పుడు ఉన్నట్టుండి ఆయాసం వచ్చింది. వైద్యనిపుణుల వద్దకు వెళ్లాడు. అన్ని టెస్ట్ ల తర్వాత తనకు లంగ్ క్యాన్సర్ కన్ఫర్మ్ అయింది. తన జీవితం ఇంకా కొన్ని నెలలే అని రియాలిటీని అంగీకరించాడు. కుటుంబ సభ్యులకు విషయం తెలిపాడు. లాక్ డౌన్ కారణంగా తాను ఆస్ట్రేలియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. భార్యతో పాటు అమ్మానాన్నకు క్యాన్సర్ తగ్గిపోతుందిలే అని చెప్పేవాడు. భార్య సంగతి ఏంటి..? అని ఆలోచించాడు. సింధు తండ్రి దీర్ఘకాలిక వ్యాధితో మంచంపట్టాడు. ఆమె తల్లే ఆయనకు సేవలు చేస్తుంది. మరోవైపు తన చావు నిర్ధారణ అయిందని హర్షవర్ధన్ కు తెలుసు. భార్యతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ భార్య ఒప్పుకోలేదు. లాక్ డౌన్ తర్వాత ఆస్ట్రేలియా వస్తానని భార్య చెప్పినా అందుకు హర్షవర్ధన్ అంగీకరించలేదు. పెద్దలను ఒప్పించి విడాకులు తీసుకున్నాడు. సింధుతో స్నేహాన్ని మాత్రం వదులుకోలేదు. తరచూ మొబైల్లో మాట్లాడేవాడు. ఈ లోపు వ్యాధి తీవ్ర రూపు దాల్చింది. మనిషిని శారీరకంగా, మానసికంగా కుంగ దీస్తున్నది. అయినా.. భరిస్తూ వస్తున్నాడు. 2022 అక్టోబర్ లో తల్లిదండ్రులను చూడడానికి ఖమ్మం వచ్చాడు. 15 రోజుల పాటు అమ్మానాన్నతో గడిపాడు. తిరిగి ఆస్ట్రేలియాలోని ఓ అనాథాశ్రమంలో రోగులకు ప్రేమ పూరితంగా వైద్యం అందించడం ప్రారంభించాడు. ఈ లోపు డాక్టర్లు డెత్ దగ్గరకు వచ్చేసిందని తేల్చిచెప్పారు. తనకు కాల్ చేసిన రెండు గంటల తర్వాత తన నుంచి రిప్లై రాకపోతే నేను భూమ్మీద లేనని కన్ఫర్మ్ చేసుకోమని కుటుంబ సభ్యులు, స్నేహితులకు చెప్పి ఉంచాడు. ఈ ఏడాది మార్చిలో డెత్ ఉండొచ్చని వైద్యులు చెప్పడంతో ఆస్ట్రేలియాలోని స్నేహితులను అలర్ట్ చేశాడు. తానే స్వయంగా శవపేటిక కొనుక్కున్నాడు. తన శవాన్ని భారత్ కు తరలించేందుకు ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ ఏడాది మార్చి 24న స్నేహితులతో వీడియో కాల్ మాట్లాడాడు. అమ్మను ఫోన్లో పలకరించాడు. అనంతరం స్నేహితులతో కలిసి కేఫ్ లో కాఫీ తాగాడు. తిరిగి ఇంటికి వచ్చి బాత్రూం కు వెళ్లాడు. మూత్రంలో రక్తం రావడాన్ని గమనించాడు. అదే బాధతో వచ్చి మంచంలో నిద్రపోయాడు. అక్కడి నుంచి శాశ్వత నిద్రలోకి వెళ్లాడు. రెండు రోజుల క్రితం శోకతప్త హృదయాలతో కుటుంబ సభ్యులు హర్షవర్ధన్ కు అంత్యక్రియలు నిర్వహించారు. తన చావును తానే ఆహ్వానించుకున్న తీరు అందరినీ ఆలోచింపజేస్తున్నది. చిన్న వయసులో భార్య విధవరాలు కాకుండా ముందుగానే విడాకులు ఇవ్వడం, తాను చనిపోయిన తర్వాత అమ్మానాన్నలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ముందుగానే ఏర్పాట్లు చేసుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. రాష్ట్రంలో, ముఖ్యంగా ఖమ్మంలో ఇప్పుడీ విషయం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి డాక్టర్ గారు అందరి కంట కన్నీరు పెట్టించారనేది నిజం.

RELATED ARTICLES

Most Popular

Recent Comments