Friday, November 22, 2024
Homeటాప్ స్టోరీస్జరుగొచ్చేమో..?! కాషాయం రావొచ్చేమో..

జరుగొచ్చేమో..?! కాషాయం రావొచ్చేమో..

కమలం గాలికి ఇతర పార్టీల్లో కదలికలు..
ఐదు రాష్ట్రాల ఫలితాలతో ఆత్మవిశ్వాసంలో రాష్ట్ర నేతలు..
టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమంటూ ప్రచారం..
తెలంగాణ పీఠం దక్కించుకోవడానికి ప్లాన్..
ఆయా పార్టీల అసంతృప్తుల చూపు బీజేపీ వైపు..
అంతర్గతంగా టచ్ లో ఉన్నారని పార్టీ ప్రముఖుల ప్రకటనలు..
ఏమో.. ఏదైనా జరుగొచ్చు. ప్రజాస్వామ్య దేశం. స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు మెండుగా ఉన్న రాజకీయ వ్యవస్థ. అవకాశం వస్తుందంటే, ఆశలు తీరుతాయంటే ఎవరు ఎటైనా వెళ్లొచ్చు, ఏదైనా చెయ్యొచ్చు. దేశంలో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కాషాయం అంటే ఇష్టం లేకున్నా కాదనేది మాత్రం ఎవరూ లేరు. నిన్న ఐదు రాష్ట్రాల ఫలితాలతో ఆ పార్టీ రాష్ట్ర శ్రేణులకు మరింత ఊపొచ్చింది, వారి మాటలకు బలం చేకూరింది. పవర్ లోకి రాబోయేది తామే అని, పగ్గాలు తమకు ఇవ్వడానికే ప్రజలంతా సుముఖంగా ఉన్నారని పూర్తి విశ్వాసంతో ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే గులాబీ సహా ఇతర ప్రధాన పార్టీల్లో అసంతృప్తులందరూ ఇప్పుడు కమలం వైపు చూస్తున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా, అంతర్గతంగా ఎవరి ఏర్పాట్లలో వారున్నారు.

స్పాట్ వాయిస్, ప్రధానప్రతినిధి: ఉధృతంగా వీస్తున్న కాషాయం గాలికి, ఎదురే లేకుండా దుమ్మురేపుతున్న కారు జోరుతో రాష్ట్రంలో రాజకీయాలు ఉత్కంఠగా మారుతున్నాయి. అధికార, విపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. కాగా, గురువారం వచ్చిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో భారతీయ జనతాపార్టీ నాయకులకు మరింత బలం చేకూరింది. ఒక్కో రాష్ట్రాన్ని చేజిక్కించుకుంటూ ముందుకెళ్తున్నామని కమలం నేతలు అంటుండగా, రాష్ట్రంలో మరో ఇరవై ఏళ్ల వరకు తమకు ఎదురే లేదని గులాబీ దళం ప్రకటించుకుంటున్నది. ఎన్నికలకు ఇంకా సమయమున్నా, ఇప్పటి నుంచి మరింత రసవత్తరంగా రాజకీయ సమీకరణాలు మారనున్నాయి అనేది కాదనలేని విషయం. ఒక్కొక్క రాష్ట్రంగా పెంచుకుంటూ పోతున్నామని బీజేపీ శ్రేణులు, అవసరమైతే అసెంబ్లీ స్థానాలన్నీ క్లీన్ స్వీప్ చేయబోతామంటున్న గులాబీ ప్రకటనతో ప్రజలంతా ఆసక్తిగా చూస్తున్నారు.
అంతర్గత గందరగోళంలో హస్తం..
వాస్తవానికి కాంగ్రెస్ కు రాష్ట్రంలో బలమైన క్యాడరే ఉంది. కానీ, పార్టీలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నది. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా నియామకమైన నుంచి సీనియర్లు, జూనియర్లు అనే వాదనను తీసుకొచ్చి పనులకు ఆటంకం కలిగిస్తూనే ఉన్నారు. అన్నీ తానై పార్టీని నడిపించేందుకు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీకి గత బలాన్ని చేకూర్చడానికి రేవంత్ సర్వశక్తులు ఒడ్డుతున్నా, తెరవెనక రాజకీయాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కిందిస్థాయిలో కార్యకర్తలు, చోటామోటా నేతలు, పార్టీ అభిమానులు ఒక్కతాటిపైకి వచ్చినా, బడాబడా నాయకులు మాత్రం రోజుకో తలనొప్పి తెచ్చే కార్యానికి శ్రీకారం చుడుతున్నారు. ఇక అది ఎప్పుడు చక్కబడుతాయో చూడాల్సిందే.

కాచుక్కూర్చున్న కాషాయం..
కాంగ్రెస్ లో అంతర్గత కయ్యాలు, టీఆర్ఎస్ ఒంటెత్తు పోకడలను అవకాశంగా మలుచుకునేందుకు బీజేపీ కాచుకుని కూర్చుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ తమ పునాదులను బలిష్టం చేసుకుంటున్నది. ఎక్కడ ఏ ఘటన జరిగినా, కష్టాలున్నాయని ప్రజలు రోడ్డెక్కినా ముందు వరుసలో కనిపిస్తూ ‘‘మేమున్నాం.. మీరు దిగులుపడకండి..’’ అంటూ ఆ పార్టీ నేతలు భరోసా ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా యావత్ దేశపు చూపునే తనవైపు తిప్పుకున్న హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం ఆ పార్టీకి ఎక్కడలేని బూస్ట్ ఇచ్చాయి. గతంలో తమకున్న బలాన్ని కూడబెట్టుకుంటూ, సర్కార్ చర్యలను ప్రతిఘటిస్తూ ప్రజలకు చేరవవడానికి శతథా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
పక్క చూపుల్లో అసంతృప్తులు..
టీఆర్ఎస్ పార్టీలో అంతర్గతం లుకలుకలు అడపాదడపా బయటపడుతూనే ఉన్నాయి. ఆ మాటకొస్తే ఆ పార్టీలో సెకండ్ కేడర్ లీడర్ల ఊసే లేదు. ప్రతి నియోజకవర్గంలో బలమైన ఎమ్మెల్యే ఉన్నాడనేది ఎవరూ కాదనలేని విషయం. కానీ అదే సమయంలో ఆ నాయకుడి తదనంతరం పార్టీకి ఊతంగా, పార్టీ కార్యకలాపాలను పైనేసుకుని నడిపే నేత ఎవరనేది చెప్పాలంటే కొంచెం కష్టతరమైన విషయమే.
పార్టీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈ మధ్యే ప్రకటించిన జిల్లా బాధ్యుల పేర్లతో కొందరు నాయకుల మధ్య అఘాతం మరింత పెరిగిందనే చెప్పాలి. కొన్నిజిల్లాల్లో స్థానిక ఎమ్మెల్యేకు కాకుండా ఇతర నేతకు బాధ్యతలు అప్పగించడం, మరికొన్ని ప్రాంతాల్లో లోకల్ లీడర్ కు బదులు మరో ప్రాంత నేతకు అప్పగించడంతో చాలామంది నొచ్చుకున్నారు. తమ అసంతృప్తిని అనుచరులు, పార్టీలో వారికంటూ ఉన్న గాడ్ ఫాదర్ల వద్ద మొరపెట్టుకున్నట్టు సమాచారం. దీంతో రాబోయే ఎన్నికల్లో గెలుపోటములు దేవుడెరుగు ముందు టిక్కెట్ వస్తుందో రాదో అనే మీమాంసలో ఉక్కిరిబిక్కిరవుతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.
బీజేపీ వైపు చూపు..
ఒక్క అధికార పార్టీ అనే కాకుండా, ఇతర పార్టీల్లో ప్రముఖులు కూడా తమకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని బీజేపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జిల్లాల్లో సుమారు రెండు దశాబ్దాలపాటు ప్రజా క్షేత్రంలో ఓ వెలుగు వెలిగిన నేతలు ఉన్నట్టు వినికిడి. ఇప్పటికే తామున్న పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడం, అందునా తమకు సరైన గుర్తింపు లభించకపోవడంతో ఆయా నేతలు కాషాయం వైపు చూస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే మాజీ మంత్రి జూపల్లి పార్టీ వీడనున్నారనే ప్రచారం ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో, తామూ తొందరపడాలని, ఇప్పుడే చక్కబెట్టుకుంటే బెటర్ అనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే, ఖమ్మం జిల్లాలో కూడా పార్టీకి అత్యంత బలీయమైన నేత కూడా బీజేపీ నేతలతో టచ్‌కి వెళ్లినట్టు, మరికొద్ది రోజుల్లోనే నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు గుసగుసలు వినవస్తున్నాయి.
తెలంగాణ పీఠం దక్కించుకోవడానికి బీజేపీ ప్లాన్..
రాష్ట్రంలో తాము పాగావేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. సీఎం కేసీఆర్ తో కాషాయం రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ సై అంటే సై అంటున్నాడు. ప్రతీ సందర్భంలో ఎదురెదురు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. ఎలాగైనా రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ చేతికే రాష్ట్రం వస్తుందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని బండి ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మలుచుకోవడంలో తలమునకలయ్యాడు. మరీ ముఖ్యంగా టీఆర్ఎస్ సర్కార్ అనుసరిస్తున్న పలు విధానాలను ప్రజల్లో ఎండగడుతూ తన పోరాటాన్ని సాగిస్తున్నారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరాశ నిస్పృహల్లో ఉన్న యువత కూడా ఆ పార్టీకి అదనపు బలంగా మారుతోంది.
గడువున్నా ఏర్పాట్లలో..
ఎన్నికలకు ఇంకా గడువున్నా ఎవరి దారి వారు చూసుకునేందుకే నేతలంతా ఎత్తులు వేస్తున్నారు. అనుకూలతలు, ప్రతికూలతలు బేరీజు వేసుకుంటూ ఎలాగైతే నెగ్గుకు రాగలం అనే విషయమై తర్జనభర్జనలు పడుతున్నారు. ఏ పార్టీలోకి వెళ్తే తమకు కలిసొస్తుందో అనే విషయపై శ్రేయోభిలాషులతో మంతనాలు జరుపుతూ, భవిష్యత్ చిత్రాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు శక్తియుక్తులకు కూడగట్టుకుంటున్నారు. మొత్తంగా నాలుగు రాష్ట్రాల అనుకూల ఫలితాలు ఇటు బీజేపీకి ఎలా అనుకూలించేనో, ప్రజారంజక పథకాలు అటు టీఆర్ఎస్ కు ఏ మేరకు గట్టెక్కించుకునే కాలమే నిర్ణయించాలి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments