Monday, November 25, 2024
Homeజిల్లా వార్తలుకార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు

కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు

కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు
వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్
కలెక్టర్ గోపి తో కలిసి మన ఊరు.. మన బడి కార్యక్రమం ప్రారంభం
స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం మన ఊరు.. మన బడి కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టిందని, తద్వారా కార్పొరేట్ పాఠశాలలక ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దనున్నట్లు టీఆర్ ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలిపారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద ప్రాథమిక పాఠశాలలో మన ఊరు.. మన బడి కార్యక్రమంలో భాగంగా సుమారు రూ.47లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి తో కలిసి ఎమ్మెల్యే అరూరి శంకుస్థాపన చేశారు. అనంతరం సర్పంచ్ సుంకరి సాంబయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. త్వరలోనే జిల్లా పరిషత్ పాఠశాలలో కూడా సుమారు రూ.కోటితో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు.మన ఊరు.. మన బడి ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్న కార్యక్రమమని, ప్రతి ఒక్కరి అభివృద్ధిలో పాఠశాల విద్యనే మూలమని గుర్తుంచుకుని సహకరించాలన్నారు. రాష్ట్రంలోని ప్రతీ విద్యార్థికి అన్ని వసతులతో కూడిన నాణ్యమైన విద్యనందించాలనే సంకల్పంతో మన ఊరు.. మన బడి కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదుల నిర్మాణం, విద్యుద్దీకరణ, పై కప్పు మరమ్మత్తులు, ఫ్లోరింగ్, డైనింగ్ హాల్, వంట గది, ప్రహరీ నిర్మాణాలు, నీటి వసతితో కూడిన టాయిలెట్స్, అధునాతన ఫర్నిచర్ తదితర సౌకర్యాలన్నీ సమాకూరుతాయని పేర్కొన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం మన ఊరు.. మన బడి కార్యక్రమానికి దాతలు ముందుకు వచ్చి తోడ్పాటునందించాలని కోరారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులను ఆశిస్తూ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం సమకూరుస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు చక్కగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.
కలెక్టర్ మాట్లాడుతూ దాదాపు 600 పాఠశాలల్లో మన ఊరు.. మన బడి కార్యక్రమాన్ని మూడు విడుతలుగా చేపడుతున్నామని, మొదటి విడత 223 స్కూళ్లు ఎంపికయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీవాత్సకోట, హరిసింగ్, ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జెడ్పీటీసీ మార్గం భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ కొడగాని రాజేష్ కన్నా, ఎంపీటీసీలు శ్రీనివాస్, జ్యోతి రమేష్, ఎస్ఎంసీ చైర్మన్ కుమారస్వామి, ఆత్మ కమిటీ చైర్మన్ గుజ్జ గోపాల్ రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments