ఆ బిల్లుతో దేశమంతా అంధకారం..
– టీఎస్పీఈజేఏసీ
– విద్యుత్ సవరణ బిల్లుకు నిరసనగా రేపు కేటీపీపీలో వర్క్ బైకాట్, మహాధర్నా
స్పాట్ వాయిస్, గణపురం: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోయే విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ టీఎస్పీఈజేఏసీ ఆధ్వర్యంలో కేటీపీపీ ప్రధాన ద్వారం ఎదుట అన్ని అసోసియేషన్లు, ట్రేడ్ యూనియన్ల సిబ్బందితో నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్లమెంట్‌లో సోమవారం ప్రవేశపెట్టబోయే విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నేషనల్ కో ఆర్డినేట్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రేపు కేటీపీపీలో జరిగే వర్క్ బైకాట్, మహాధర్నా కార్యక్రమాన్ని ఉద్యోగులు విజయవంతం చేయాలని జాక్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం కేటీపీపీలో సర్వీస్ బిల్డింగ్ ముందు మహాధర్నా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల లాభార్జన ధ్యేయంగా విద్యుత్ సంస్థలు, సహజ వనరులను ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో ఈ విద్యుత్ సవరణ బిల్లును చట్టంగా మార్చాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దీని వల్ల దేశ వ్యాప్తంగా సమస్త ప్రజానీకం, రైతాంగం, విద్యుత్ ఉద్యోగులు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఒంటెద్దు పోకడ విధానాన్ని, తన మొండి వైఖరిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ సంస్థల్లో సోమవారం ఉద్యోగులంతా వర్క్ బై కాట్, మహాధర్నా చేపడుతున్నట్లు తెలిపారు.
Recent Comments