Friday, November 22, 2024
Homeలేటెస్ట్ న్యూస్భార్య.., భర్త.. ఓ స్నేహితుడు..

భార్య.., భర్త.. ఓ స్నేహితుడు..

ఇదో విషాద కథ..
స్పాట్ వాయిస్, ఖమ్మం: భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ ఇద్దరి ప్రాణాలు బలితీసుకుంది. బావిలో దూకి సచ్చిపోతానని వెళ్లిన భార్య నిజంగానే దూకేసిందేమోననే అనుమానం, కాపాడాలనే తాపత్రయంతో ముందు వెనుక ఆలోచించకుండా ఓ భర్త బావిలో దూకేశాడు. ఈత రాకపోవడంతో నీట మునిగి మరణించాడు. అతన్ని కాపాడేందుకు బావిలో దూకిన స్నేహితుడు సైతం నీటిలో గల్లంతై చనిపోయాడు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో చోటు చేసుకుంది. నేలకొండపల్లి మండలంలోని అప్పలనరసింహాపురం గ్రామానికి చెందిన నాగరాజు, రమణమ్మ దంపతులు. ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య ఘర్షణ నెలకొంది. గొడవతో మనస్తాపానికి గురైన రమణమ్మ .. బావిలో దూకి సచ్చిపోతానటూ ఏడుస్తూ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కాసేపటికి నాగరాజు భార్య కోసం చుట్టుపక్కల వెతికాడు. కానీ ఎక్కడా కనిపించలేదు. దీంతో బావిలో దూకిందేమోనని కంగారుపడిపోయాడు. ఇంటికి సమీపంలో వ్యవసాయ బావి ఉండటంతో అందులోనే దూకి ఉంటుందనే అనుమానంతో అక్కడికి వెళ్లాడు. వెళ్లేప్పుడు తన స్నేహితుడు యండ్రాతి జోజిని తీసుకెళ్లాడు. బావి దగ్గరకు వెళ్లగానే భార్యను రక్షించుకోవాలనే తొందరలో ఈత రాకపోయినా నాగరాజు బావిలో దూకేశాడు. నాగరాజుకు ఈత రాదనే విషయం తెలిసిన జోజి స్నేహితుడిని కాపాడేందుకు బావిలో దూకాడు. ఈ క్రమంలో నాగరాజు, జోజి ఇద్దరూ నీట మునిగి గల్లంతయ్యారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నాగరాజు, జోజి మృతదేహాలను బయటకు తీశారు. పంచానామా నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే రమణమ్మ ఏమైందని స్థానికులు వెతగ్గా.. సమీప చేనులో ఏడుస్తూ కనిపించింది. ఆమెకు స్థానికులు జరిగిన విషయం చెప్పగా గుండెలవిసెలా రోదించింది. ఏదో బెదిరిద్దామని బావిలో దూకుతానని చెబితే.. అదే తన భర్త మరణానికి కారణమైందని కన్నీళ్లు పెట్టుకుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments