Sunday, November 24, 2024
Homeలేటెస్ట్ న్యూస్భర్త వెంటే భార్య..

భర్త వెంటే భార్య..

భర్త వెంటే భార్య..
చావులోనూ వెంటే వెళ్లి..
ఇంటాయన పోయాడని ఇల్లాలూ ఆత్మహత్య
మోరంచపల్లిలో విషాదం..

స్పాట్ వాయిస్, గణపురం : వెంటే ఉంటానన్న బంధం మధ్యలోనే వదిలేసి పోయింది. తోడు వెళ్లిపోయిందన్న దిగాలు తనువు వదిలేలా చేసింది. ధైర్యంగా ఉన్న భర్త ఒంటరిని చేస్తే.., నా అనుకున్న వారెవరు లేరనే దిగాలు జీవితాన్ని భారంగా మార్చింది. అతడి వెంటే ఆమె సాగింది. భర్త మరణాన్ని తట్టుకోలేని ఆ మహిళ తానూ బలవన్మరణం చెంది తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఘటన వివరాలు కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి…
భూపాలపల్లి మండలం మోరంచపల్లికి చెందిన చుక్క సారయ్య (55)కు ఇద్దరు భార్యలు. మెుదటి భార్యకి ఇద్దరు కుమారులు, కూతురు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. పెద్ద కుమారుడు కొద్ది సంవత్సరాల కిందటే మృతి చెందాడు. కాగా, సారయ్య కొద్ది రోజుల కిందట కవిత (50) అనే మహిళలను రెండో వివాహం చేసుకున్నాడు. దీంతో మెుదటి భార్యతో నిత్యం గొడవలు జరుగుతుండేవి. ఇవన్నీ తట్టుకోలేక మెుదటి భార్య, పిల్లలు సారయ్యను వదిలేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచి సారయ్య, కవితతో కలిసి మోరంచపల్లిలోనే ఉంటున్నాడు. కాగా, మంగళవారం అర్ధరాత్రి సారయ్య గుండెపోటుతో మరణించాడు. భర్త మరణాన్ని తట్టుకోలేక కవిత కూడా మృతదేహం పక్కనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
తెల్లవారినా ఇంటి తలుపులు ఎంతకూ తీయకపోవడంతో స్థానికులు వెళ్లి చూడగా భార్యభర్తలు విగత జీవులుగా కనిపించారు. దీంతో స్థానికంగా విషాదం అలుముకోగా, బంధువుల రోదనలు మిన్నంటాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments