Sunday, November 24, 2024
Homeటాప్ స్టోరీస్తాగుట్ల ఓరుగల్లు సెకెండ్

తాగుట్ల ఓరుగల్లు సెకెండ్

– బీర్ల అమ్మకాల్లో రికార్డు మోత..
– 150 శాతం పెరిగిన అమ్మకాలు..
– రాష్ట్రంలో రెండో స్థానంలో వరంగల్ జిల్లా
– 1.15 కోట్ల లీటర్ల బీర్ల విక్రయాలు..
– మూడు శాతం పెరిగిన ఇతర మద్యం సేల్స్..

మామూలుగా ఉండదు మన్నోళ్లది. ఎత్తారంటే బాటిల్ దించే ప్రసక్తే ఉండదు. తాగడం మొదలు పెడితే స్టాక్ ఒడిసే దాకా ఆగరు. పర్సు ఖాళీ అవుతున్నా.., సర్కార్ ఖజానాను నింపుతున్నాం.. అదే మహా భాగ్యం.. అని భావించే ధీరోదాత్తులు. బ్రాండ్ల పట్టింపు ఉండదు., ఎమ్మార్పీనా., సిండికేటా.. అనే వేరియేషన్లు పట్టించుకోరు. కడుపులో పోసేది మధుపానీయం అయినప్పుడు మిగతావన్నీ పట్టించుకుని టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకనుకునే దయాహృదయులు. అవును ఏదీ పట్టించుకోలేదు కనుకే వారి ఐక్యత బలం బయటపడింది. బీర్ల కేసులు లేపడంలో రికార్డు నెలకొంది. అయినా ఆ మాటకొస్తే రికార్డులు వారికేమన్నా కొత్తవా..? వాటి సృష్టికర్తలు వారే.., తిరగరాసేదీ వారే. ఒక్క మాటలో చెప్పాలంటే సమాజమంతా వారి బలాన్ని గుర్తిస్తున్నా, వారు మాత్రం తెలుసుకోలేకపోతున్న బలహీనులే వాళ్లు. సో.. బీర్ల అమ్మకాలు అమాంతంగా పెంచారు., గల్లా పెట్టెలన్నీ గళగళా నింపారు. వాళ్లు హ్యాపీ.. ఆబ్కారీ వెరీ వెరీ హ్యాపీ..
                                                                              -స్పాట్ వాయిస్, క్రైమ్

చుక్క పడకుంటే దిక్కులు మరిచినంత పని., మద్యం వాసన రాకుంటే మతిపోయినంత ఇబ్బంది. యాళ్లకు నోట్లోకి ముద్దు దిగకున్నా తట్టుకుంటారు గానీ, ఇంత మందు గొంతులోకి జారకుంటే మాత్రం ఆగమాగం అవుతారు. ఎన్ని కష్టాలొచ్చినా, ఎంత ఇబ్బందులు కలిగినా మందు తాగాల్సిందే. కాకపోతే ఇప్పుడు అసలే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో కాస్త బీర్ల వైపు మాత్రం మనస్సు మార్చుకున్నారు. ఎంత సేవిస్తున్నామో అనే లెక్క కూడా చూసుకోకుండా తాగేశారు.., తాగుతున్నారు కూడా.

కరోనాతో రెండేళ్లుగా ఎండకాలం నాలుక పిడ్స కట్టుకుని పోయింది. కొద్దికొద్దిగా తాగినా రోగం భయానికి ఇబ్బంది పడాల్సి పరిస్థితి. ఇప్పుడు కరోనా భయం పోయింది. దీంతో లిక్కర్ అమ్మకాలు అమాంతం పెరిగిపోయాయి. కలిసొస్తున్న ఎండకాలానికి, కన్ను కొట్టి పిలుస్తున్న చిల్డ్ బీర్లతో మద్యం ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అందుకే గతేడాది మే నెలతో పోల్చితే ఈ సీజన్ లో బీర్ల అమ్మకాలను ఏకంగా 90 శాతం పెంచి తమ బీర్ భక్తిని చాటుకున్నారు.

వేడికి ఉపశమనంగా..
భానుడి భగభగతో రాష్ట్రమంతా భగ్గుమంటోంది. బయట తిరగడం దేవుడెరుగు.., ఇంట్లో కూర్చున్న చోటే చెమటలు కారుతూనే ఉన్నాయి. వాతావరణంలోని తేమతో ఒళ్లంతా మంటలు లేస్తోంది. ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నా తాత్కాలిక ఉపశమనమే. దీంతో చల్లటి పానీయాలకు తెగ ప్రాధాన్యం పెరుగుతోంది. అందునా మద్యం తాగే వారి మది అంతా చిల్డ్ బీర్ వైపు లాగుతోంది. మాడు పగిలే వేడిలో గొంతులోకి చల్లని బీరు జారుగుతుంటే నా సామి రంగా.. అంతకన్నా స్వర్గం ఉంటుందా..? అనే ఫీలింగ్ తో మద్యం ప్రియులంతా బీర్ల వాడకాన్ని ఎక్కువ చేశారు. ఇతర మద్యం బ్రాండ్ల కంటే ఈ వేసవిలో బీర్ల వైపే మొగ్గు చూపుతుండడంతో అమ్మకాలు అమాంతం పెరిగాయి.
పుష్కలంగా బీర్లు..
నీళ్లు లభించే చోటు ఉండొచ్చు గానీ, చిల్డ్ బీర్ దొరకని ప్రదేశం లేదంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో వాడవాడలా అనధికారికంగా అమ్మకాలు జోరుగా సాగుతూనే ఉన్నాయి. అన్ని చోట్ల మద్యం దందా విపరీతంగా నడుస్తోంది. గల్లి గల్లీల్లో మద్యం సీసాలు అందుబాటులో ఉంటున్నాయి. అసలే ఎండాకాలం, అడుగు తీసి అడుగు బయటపెట్టడానికి ప్రజలు జంకుతున్న భయంకర పరిస్థితి. దీంతో కావాల్సిన సరుకులు అందుబాటులో ఉంటే అంతకన్నా కిక్కేముంటది చెప్పండి. ఎక్కడికో వెళ్లి తెచ్చుకునే కంటే కాస్త రేట్ ఎక్కువైనా మంచిదే అని తమకు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోనే మద్యం కొనుగోళ్లు జరుపుతున్నారు. షార్ట్ గా చెప్పాలంటే నీళ్లు అడిగినా కూడా నీళ్లేం తాగుతవ్.. చల్లగా ఓ బీరే వెయ్యరాదు.. అనే స్థాయిలో ప్రజల మైండ్ సెట్ మారింది. ఇట్లాంటి పరిస్థితులు ఉంటే రికార్డు స్థాయి అమ్మకాలు జరక్కుండా ఎలా ఉంటుంది.

పెరిగిన అమ్మకాలు..
సుమారు మూడు నెలలుగా డోస్ పెంచుతున్న భానుడు.., దానిని తట్టుకోవడానికి తమ డోస్ ను కూడా పెంచుకుంటూ వెళ్తున్న మద్యం ప్రియులు. ఒకరిపై ఒకరు పై చేయి సాధించడానికి పోటీ పడుతున్నారా.. అన్నట్టుగా అనిపించే దృశ్యాలు. దానికి తోడు కరోనా తర్వాత పూర్తి స్థాయిలో జరుగుతున్న శుభకార్యాలు. దీంతో లక్షల సంఖ్యలో ఫంక్షన్లు జరగడం కూడా మద్యం అమ్మకాలు పెరగడానికి ఒక కారణంగా చెప్పొచ్చు. దీనికి తోడు 24 గంటల పాటు కరెంట్ ఉంటుండడంతో చల్లని బీర్లు పుష్కలంగా లభించడం కూడా వాడకాన్ని పెంచాయి. ఎంతైనా ఎండల్లో నుంచి వచ్చిన వారు చల్లని పానీయాలు తాగడానికి ఇష్టపడతారు తప్ప విస్కీ, బ్రాందీ, ఇతరాల జోలికి పోరు కదా. దీంతో బీర్ల సేల్స్ విచ్చలవిడిగా పెరిగాయని వైన్ షాపులు నిర్వాహకులు తెలుపుతున్నారు. 2021-22లో మద్యం 26,87,808 కేసులు అమ్ముడుపోగా, అందులో బీర్లే 26,12,694 కేసులు ఉన్నాయి. అలాగే, 2022-23లో ఇప్పటి వరకూ 23,84,285 కేసుల బీర్లు లాగించేశారు. మొత్తంగా మద్యం అమ్మకాలు గతేడాదితో పోల్చితే రాష్ట్రంలో సుమారు 19 శాతం పెరిగినట్టు ఆబ్కారీ శాఖ తెలిపింది. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో అన్ని మద్యం దుకాణాల్లో 49,84,285 కేసుల బీర్లు, 27,69,998 కేసుల ఇతర మద్యం అమ్మకాలు జరిగాయి.

టాప్ టూ లో వరంగల్..
తెలంగాణలో బీర్ల అమ్మకాల్లో జిల్లాలన్నీ పోటీ పడుతున్నా, మొదటిస్థానం మాత్రం రంగారెడ్డి జిల్లా దక్కించుకుంది. ఉమ్మడి పది జిల్లాల్లో 150 శాతం వరకూ బీర్ల అమ్మకాలు పెరిగాయి. మార్చి నుంచి ఇప్పటిదాకా 6,702 కోట్ల రూపాయల బీర్ల సేల్స్ జరిగాయి. ఈ ఏడాది మే నెలలో మద్యం ప్రియులు 10.64 కోట్ల బీర్లను తాగేశారని గణాంకాలు చెబుతున్నాయి. బీర్ల అమ్మకాల్లో రంగారెడ్డి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుస్తోంది. ఆ జిల్లాలో 2.38 కోట్ల లీటర్ల బీర్ల అమ్మకాలు జరగ్గా, రెండో స్థానంలో వరంగల్ నిలిచింది. వరంగల్ జిల్లాలో 1.15 కోట్ల లీటర్ల బీర్ల విక్రయాలు జరిగినట్టు అధికారులు తెలుపుతున్నారు. మొత్తంగా ఎండల కారణంగానే మద్యం అమ్మకాలు, అందునా బీర్ల సేల్స్ ఒక్కసారిగా పెరిగిందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments