Thursday, November 21, 2024
Homeటాప్ స్టోరీస్హైరిస్క్ లో వరంగల్

హైరిస్క్ లో వరంగల్

డెంగీ, చికున్ గున్యా ప్రబలే ఛాన్స్
టీజీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ హెచ్చరిక
డేంజర్ జోన్ లో వరంగల్ సహా నాలుగు జిల్లాలు
12 రోజుల్లో 88 డెంగీ కేసులు

స్పాట్ వాయిస్, వరంగల్: వైరల్‌ ఫీవర్లు విజృంభిస్తున్నాయి. ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. వైరల్ ఫీవర్స్, డెంగీ, చికున్ గున్యా వరుసబెట్టి దాడి చేస్తున్నాయి. ప్రతీ ఇంటిలోను జ్వర పీడితులు మూలుగులే వినిపిస్తున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ నిర్వహిస్తున్న సర్వేలో కూడా జ్వరాలకు సంబంధించి భారీగా కేసులు నమోదవుతున్నాయని చెబుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల ఈ జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉందని చెబుతున్నారు.
వ్యాధులు తెచ్చిన వరదలు..
అసలే వర్షాకాలం.. అందులోనూ మొన్నటివరకు భారీ వర్షాలతో వరదలు ముంచెత్తాయి. దీంతో.. ఒక్కసారిగా సీజనల్ వ్యాధులు, వైరల్ ఫీవర్లు ఆవరిస్తున్నాయి. తాజాగా డెంగీ, చికున్ గున్యా కేసులు కూడా రోజురోజుకు పెరిగిపోతుండటం ప్రజల్లో భయాందోళనలకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (టీఎస్ హెచ్ఏ).. కీలక వ్యాఖ్యలు చేసింది. వరంగల్ జిల్లా హై రిస్క్ లో ఉన్నట్లు పేర్కొంది. మన జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్‌ , సూర్యాపేట, ఖమ్మం జిల్లా్లు సైతం ఉన్నాయి. డెంగ్యూ, చికున్ గున్యా కేసులు విపరీతంగాపెరిగే అవకాశాలున్నాయని హెచ్చరించింది.
కేసులు పెరిగే ఛాన్స్
నాలుగు జిల్లాలు మొన్నటి భారీ వర్షాలకు ఎక్కువగా ప్రభావితం కావడంతో.. వైరల్ ఫీవర్లు, సీజనల్ వ్యాధులతో పాటు డెంగీ, చికున్ గున్యా కేసులు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని టీఎస్ హెచ్ ఏ అంచనా వేసింది. ఈ జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యాధులు ప్రభలకుండా ఉండేలా పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత శుభ్రత కూడా పాటించాలని సూచించింది. టీఎస్ హెచ్ ఏ పరిశీలన ప్రకారం.. రాష్ట్రంలో డెంగీ కేసులు పెరుగుతున్నప్పటికీ.. చికున్‌గున్యా కేసుల వ్యాప్తి ఎక్కువగా ఉందని తేలింది. ఫ్లూ ఏ, రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (ఆర్‌ఎస్‌వీ), ఎంటెరిక్ ఫీవర్ వంటి ఇతర వైరల్ ఇన్‌ఫెక్షన్లు కూడా విపరీతంగా నమోదవుతున్నట్టు తెలుస్తోంది.
భయపెడుతున్న డెంగీ
రాష్ట్ర ఆరోగ్య శాఖ నుంచి వచ్చిన డేటా ప్రకారం.. డెంగీ కేసుల్లో గణనీయమైన పెరుగుదలను గుర్తించారు. ఆగస్టు 23ల తేదీన 4459 కేసులుండగా.. ఆగస్టు 30 నాటికి ఆ సంఖ్య 6242 కి చేరుకుంది. అధిక జ్వరం, కీళ్ల నొప్పులు, దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటున్నాయి. హైదరాబాద్‌లో ముఖ్యంగా చిన్నారుల్లో డెంగీ, చికున్‌గున్యా కేసులు పెరుగుతున్నట్టు నివేదికలు చెప్తున్నాయి. నగరంలోని ఆసుపత్రుల నివేదికల ప్రకారం.. దాదాపు 20 శాతం మంది రోగులు ఆస్పత్రుల్లో చేరుతున్నట్టు తెలుస్తోంది. అయితే.. వీరిలో ఎక్కువ మంది పిల్లలే ఉంటుండటం గమనార్హం. మిగిలిన 80 శాతం మంది ప్రాథమిక చికిత్సతో ఇంట్లోనే కోలుకుంటున్నారు.
వరంగల్ భారీగాకేసులు
వరంగల్ జిల్లాలో డెంగీ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఆగస్టు నెలలో 88 కేసులు నమోదు కాగా.. సెప్టెంబర్ మాసంలోని 12 రోజుల్లోనే 88 కేసులు నమోదైనట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇక హన్మకొండ జిల్లాలో 32 కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ కేసుల సంఖ్య ఆస్పత్రులకు వచ్చి చికిత్స చేసుకున్న వారివి మాత్రమే. ఇక ఇంట్లో ఉంటూ వైద్యం చేయించుకునే వారి సంఖ్య ఇంతకు మించే ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ హెచ్చరించడం, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏ జిల్లాలో నమోదు కానంతంగా వరంగల్ జిల్లాలో కేసులు నమోదు కావడం ఆందోళన రేపుతోంది. ప్రజల్లో వ్యాధుల పట్ల అవగాహన ఉండాలని, డెంగీ, చికున్‌గున్యా రెండింటి ప్రమాదాన్ని తగ్గించడానికి ఖాళీ నీటి పాత్రలు, కాలువలను శుభ్రపరచడం, దోమలను నివారించే చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
పిల్లల్లో ప్రభావం ఎక్కువ..
వైరల్ ఫీవర్, డెంగీ ప్రభావం పిల్లలపై ఎక్కువగా కనిపిస్తోంది. పిలల దవాఖానల ఎదుట తల్లిదండ్రులు పడిగాపులు కాస్తున్నారు. పిల్లలకు ఇట్టే జ్వరం సోకుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాళ్ల నొప్పులు, తలనొప్పి, వాంతులు, శరీరంలో నీటి స్థాయిలు పడిపోవడం తదితర లక్షణాలు కనిపిస్తున్నాయి. కొంతమందిలో కాళ్లు, చేతులపై దద్దుర్లు కూడా వస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments