పరకాల పట్టణ ప్రగతి స్టేజీపై కౌన్సిలర్ల భర్తలు..
మహిళలకు పెద్దపీట వేసే కేసీఆర్ పాలనలోనూ పురుషాధిక్యమేనా..
మండిపడుతున్న ప్రజలు, ప్రతిపక్షాలు
స్పాట్ వాయిస్, పరకాల: మగ పెత్తనం ఇంకా పోలేదు.. ఆడవాళ్లు ప్రజాప్రతినిధులుగా ఉన్నా.. భర్తలే రాజ్యమేలుతున్నారు. దీనికి నిదర్శనం పరకాల మున్సిపల్ కౌన్సిలర్ల భర్తల తీరు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం పట్టణ ప్రగతి వేడుకను పరకాల మున్సిపల్ కమిషనర్ శేషు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డీజేలు పెట్టి మున్సిపల్ సిబ్బందితో ర్యాలీ తీశారు. ఆటపాటలతో సందడి చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. సమావేశంలో పురుషాధిక్యమే కొట్టొచ్చినట్లు కనిపించింది. పరకాల మున్సిపల్ పరిధిలోని పలు వార్డులకు మహిళా కౌన్సిలర్లు ఉన్నారు. వీరిని స్టేజీపైకి పిలిచినప్పుడు భర్తలు కూడా వెంట వచ్చి స్టేజీపై కూర్చుకున్నారు. కౌన్సిలర్ ఆమె.. అతనా అంటూ సమావేశానికి హాజరైన వారంతా చెవులు కొరుక్కున్నారు. మహిళలకు పెద్ద పీట వేసే సీఎం కేసీఆర్ సర్కార్ లో ఇలా భార్య పదవితో భర్తలు స్టేజీలపైకి ఎక్కి కూర్చోవడంపై విమర్శలు వెల్లువెత్తు్తున్నాయి. పట్టణ ప్రగతి వేడుకలో అధికారులు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, సంబంధిత ప్రజాప్రతినిధులు కూర్చోవాలే కానీ.. ఏ సంబంధం లేని జిరాక్స్ లు కూర్చోవడం ఏంటని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.
పట్టణాభివృద్ధికి సహకరిస్తున్నారని..
కౌన్సిలర్ భర్తలు స్టేజీపై కూర్చోవడంపై పరకాల మున్సిపాలిటీ కమిషనర్ శేషును వివరణ కోరగా.. పట్టణ ప్రగతి వేడుక ప్రజల కార్యక్రమమని, పట్టణ ప్రగతికి సహకరించే ప్రముఖులను స్టేజీపైకి సన్మానం కోసం పిలిచామని చెప్పారు.
Recent Comments