రెండు రోజుల్లో వర్షాలు..
రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ల సూచన
స్పాట్ వాయిస్, హన్మకొండ: అసని తుఫాను ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడుతాయని పేర్కొంది. తుఫానుకు తోడు తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్నాటక వరకు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా.. మంగళవారం నగరంలో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాగల 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురియనున్నాయి.
రైతులు కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి పోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రైతులకు విజ్ఞప్తి చేశారు.
Recent Comments