తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ షురూ..
2024 జనవరి 16తో ముగియనున్న అసెంబ్లీ గడువు..
స్పాట్ వాయిస్, బ్యూరో : అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అధికారుల బదిలీలు, పోస్టింగుల విషయమై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ అసెంబ్లీ గడువు 2024 జనవరి 16తో ముగియనుండగా… మిజోరాం అసెంబ్లీ గడువు డిసెంబర్ 17, ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్ గడువు జనవరి 3,6 తేదీలతో ముగియనుంది. రాజస్థాన్ అసెంబ్లీ గడువు జనవరి 14తో పూర్తి కానుంది. దీంతో ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులకు ఈసీ అదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణ విధుల్లో నేరుగా ఉండే అధికారులను సొంత జిల్లాల్లో.. ఎక్కువ కాలం పని చేసిన ప్రాంతాల్లో ఉండరాదని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఒకేచోట మూడేళ్ల గడువు మించరాదని స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణ విధుల్లో నేరుగా ఉండే డీఈఓలు, డిప్యూటీ డీఈఓలు, ఆర్ఓలు, ఏఆర్ఓలు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, నోడల్ అధికారులు, తహసీల్దార్లు, ఐజీలు, డీఐజీలు, కమిషనర్లు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, ఇన్‌స్పెక్టర్లకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి.ఈ మేరకు సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని సీఈఓలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. బదిలీలు, పోస్టింగుల విషయమై జూలై నెలాఖరు వరకు నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే వారిలో తమ సమీప బంధువులు ఎవరూ లేరని.. తమపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగ్‌లో లేవని ఎన్నికల విధుల్లో ఉండే అధికారులు తర్వాత డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని ఈసీ పేర్కొంది.
Recent Comments