స్పాట్ వాయిస్ , బ్యూరో: దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తున్న తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో సంపూర్ణ మద్దతు ఉన్నందున పథకాల విషయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, తదితర ప్రజాప్రతినిధులు ప్రజలను మరింత చైతన్య పరచాలని టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీదే గెలుపని, బీజేపీ మనల్ని ఏమీ చేయలేదని, ఆ పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని సీఎం అన్నారు. బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా మద్దతు ప్రకటించే క్రమంలో సీపీఐ, సీపీఎం పార్టీలు మునుగోడులో టీఆర్ఎస్ పార్టీకి మద్దతివ్వాలని నిర్ణయించాయని తెలిపారు. ప్రజాస్వామిక, లౌకికవాద శక్తులు మన పిలుపునందుకొని మద్దతుగా ముందుకురావడం హర్షణీయమని సీఎం కేసీఆర్ అన్నారు.
శనివారం తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటుగా, పార్టీకి చెందిన రాజ్యసభ, లోక్ సభ ఎంపీలు కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం వల్లనే రెండోసారి కూడా ప్రజలు భారీ మెజారిటీతో పట్టం కట్టారని, ఇప్పుడు కూడా ప్రజల్లో పార్టీకి అదే ఆదరణ ఉన్నదన్నారు. ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు ఈ వాతావరణాన్ని కాపాడుకొని సంక్షేమ పథకాల విషయంలో ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న కృషిని విడమర్చి చెప్పి వారి ఆదరణను పొందడానికి ప్రయత్నించాలని కోరారు. రాష్ట్రంలో ఇటీవల జరిపిన పలు సర్వేల్లో టీఆర్ఎస్ పార్టీకి ఢోకాలేదని, గతంకంటే ఎక్కువ సీట్లు వస్తాయని తేలిందని సీఎం అన్నారు. ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరగనున్న మునుగోడు ఉప ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ పార్టీకి పూర్తి సానుకూలత ఉన్నదని ఆ నియోజకవర్గంలో మొదటిస్థానంలో టీఆర్ఎస్, రెండోస్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో బీజేపీ ఉన్నట్లు సర్వే రిపోర్టులు చెబుతున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 స్థానాల్లో 11 స్థానాలు టీఆర్ఎస్ పార్టీయే గెలిచిందని, కాంగ్రెస్ సీనియర్ నాయకులను ఓడించి హుజూర్ నగర్, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన విధంగానే.. మునుగోడులో కూడా టీఆర్ఎస్ ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటే నల్లగొండ జిల్లాలో చరిత్ర సృష్టించిన వారమవుతామని సీఎం పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ నిర్ణయించిన ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధ వహించి, ప్రచారం చేయాలని సీఎం కేసీఆర్ కోరారు.
బీజేపీ ప్రమాదకరం..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ, ప్రజా వ్యతిరేక విధానాలతో ఆ పార్టీ ప్రతిష్ట దేశవ్యాప్తంగా రోజురోజుకూ దిగజారుతున్నదని సీఎం అన్నారు. దేశంలో ఒకప్పుడు వాజ్ పేయి నాయకత్వంలో ఇతర పార్టీలతో కలిసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని హుందాగా నడిపారని, ఇపుడు బీజేపీ అనుసరిస్తున్న విధానాలతో ఆ పార్టీ మిత్రపక్షాలన్నీ ఎన్డీఏ నుంచి దూరమైపోయాయని సీఎం అన్నారు. 12 రాష్ట్రాల్లో ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చుకుంటూ బీజేపీ, దేశంలో ప్రమాదకర పరిస్థితులను సృష్టిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈడీల పేరుతో బెదిరించి, రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొడుతున్నారని, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అట్లనే కూలగొట్టారని అన్నారు. ఏ ఒక్క వర్గానికీ మేలు చేశామని చెప్పుకోలేని దుస్థితిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్నదన్నారు. దళితులు, గిరిజనులు, బీసీలు, మహిళలు, యువత.. ఇలా ఎవరికీ ఏ మేలూ చేయలేదన్నారు. ద్రవ్యోల్బణం, రూపాయి పతనం, బ్యాంకుల లూఠీలు, 12 లక్షల కోట్లకు ఎన్.పీ.ఏలు చేరడం, రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి ప్రధానే స్వయంగా క్షమాపణలు చెప్పడం, మతపిచ్చి లేపి పోలరైజేషన్ ప్రయత్నాలతో బీజేపీ పరిస్థితి దారుణంగా దిగజారిందని, ఒక పద్ధతిగా ఉన్న దేశాన్ని అరాచక పోకడల ద్వారా పిచ్చి, పిచ్చి పనులు చేస్తూ భ్రష్టు పట్టిస్తున్నారని సీఎం అన్నారు.
భారతదేశ ఆర్ధిక మంత్రి ఒక రేషన్ షాపుకు వచ్చి ప్రధాని ఫొటో పెట్టాలనే పరిస్థితి వచ్చిందంటే.. బీజేపీ నాయకులు ఎంత ఫ్రస్టేషన్లో ఉన్నారో అర్ధమవుతుందని అన్నారు. 2024లో బీజేపీ ముక్త్ భారత్ కాబోతున్నని సీఎం కేసీఆర్ అన్నారు.
ఈడీ, సీబీఐ, ఐటీ దాడుల పేరుతో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న బెదిరింపుల ధోరణికి భయపడి వెయ్యి నుంచి 2 వేల కోట్ల రూపాయల వ్యాపారం చేసే పారిశ్రామిక వేత్తలు కూడా దేశం వదిలి దుబాయ్ వంటి దేశాలకు తరలిపోతున్నారని సీఎం అన్నారు. ఇట్లా 691 మంది పారిశ్రామికవేత్తలు తమ వ్యాపారాలను దుబాయ్ కి తరలించినట్లు సమాచారం ఉన్నదన్నారు.
రైతు సంఘాలు ఆశ్చర్య పోయాయి..
ఇటీవల 26 రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు సంఘాల నాయకులు తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలను, దళితబంధును చూసి ఆశ్చర్యపోయారని దేశవ్యాప్త రైతు, దళిత ఉద్యమాలకు నాయకత్వం వహించాలని తనను వారు కోరారని సీఎం కేసీఆర్ వివరించారు.
పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లి సామూహిక వనభోజనాల కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు చేరువ కావాలని సూచించారు.
రాష్ట్రంలో ఇప్పటికే 36 లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందిస్తున్నామని, కొత్తగా మరో 10 లక్షల మందికి కూడా పెన్షన్లు మంజూరైనందున మొత్తం 46 లక్షల మందికి బార్ కోడ్ ఉన్న పెన్షన్ కార్డులను ఎమ్మెల్యేలు దగ్గరుండి ప్రజలకు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ కోరారు.
దళితబంధు పథకం కోసం రూ.6 వేల కోట్ల నిధులను సమకూర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, ఒక్కో నియోజకవర్గానికి 500 మంది లబ్ధిదారులను ఎంపిక చేసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. గిరిజనులకు పోడు భూముల సమస్యల్ని పరిష్కరించే విషయంలో మంత్రులు సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలకు పూర్తిస్థాయిలో సహకరించాలని సీఎం సూచించారు. సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో తెలంగాణ జాతీయ సమైక్యతా ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంలో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు భాగస్వాములు కావాలన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
Recent Comments