Sunday, November 24, 2024
Homeలేటెస్ట్ న్యూస్పీడవిరగడైంది..

పీడవిరగడైంది..

పీడవిరగడైంది..

టీఆర్ఎస్ లో ఆత్మ గౌరవం లేదు..
తలదించుకుని బతకడం నాకు రాదు.. ఆ అవసరం కూడా నాకు లేదు..
22 ఏండ్ల అనుబంధానికి మిగిలింది శూన్యం..
టీఆర్ఎస్ లో ఇప్పుడు ఉద్యమకారులు లేరు..
అందుకే పార్టీ నుంచి వెళ్తున్నా..
ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తా..
గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ మాజీ చైర్మన్‌ కన్నెబోయిన రాజయ్య యాదవ్

స్పాట్ వాయిస్, హన్మకొండ: ‘‘కారు పార్టీకి నేటితో తెగతెంపులు., 22 సంవత్సరాల నా గులాబీ ప్రయాణ చరిత్ర ఇవ్వాళ్టితో సమాప్తం. టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఆత్మ గౌరవం లేదు.., కేసీఆర్ లో మునుపటి మనిషి కూడా కనిపించడంలేదు. ఆ మాటకొస్తే నాకు పదవులు ఎందుకు ఇవ్వలేదో అర్థం కాని విషయమం.. వంగివంగి దండాలు పెడుతూ పదవులు ఆశించే తత్వం నాది కాదు. అందుకే ఆత్మగౌరవాన్ని చంపుకుని ఇందులోనే ఉండడం ఇష్టం లేక గులాబీ పార్టీని వీడుతున్నాను…’’ అని గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ మాజీ చైర్మన్‌ కన్నెబోయిన రాజయ్య యాదవ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీతో తనకున్న రెండు దశాబ్దాలకు పైగా చరిత్రకు నేటితో ముగింపు పలుకుతున్నానన్నారు. నేటితో తన బాధల నుంచి విముక్తి పొందుతున్నట్టుగా ఫీల్ అవుతున్నానని ప్రకటించారు.

టీఆర్ఎస్ పార్టీలో ఎన్నో బాధ్యతలు నిర్వర్తించానన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా, మెదక్ జిల్లా ఇన్చార్జిగా, గజ్వేల్ ఇన్చార్జిగా పనిచేశానని అధినేత అప్పగించిన ఏ పనినైనా శక్తిమేరకు నిర్వర్తించానని పేర్కొన్నారు. టీఆర్ఎస్ లో బాధలు మిగులుతాయి తప్ప పదవులు రావని సహచరులు, శ్రేయోభిలాషులు చెబుతున్నా అధిమిపట్టుకుని నడక సాగించానన్నారు. అసలు భవిష్యత్తే ఉండదని సూచిస్తున్నా సీఎంపై నమ్మకంతో ప్రయాణం సాగించానని, కానీ ప్రత్యక్షంగా అవమానాలే మిగిలాయన్నారు. కేసీఆర్ ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు.., రాజ్యసభ కేటాయిస్తానన్నారు. కానీ ఎందుకు ఎవ్వలేదో నాకైతే అర్థం కావడం లేదని వాపోయారు.
ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉద్యమకారులు లేరు.., ఆత్మగౌరవం గలవారు అంతకన్నా కానరారు. తలదించుకుని బతకడం నావల్ల కాదు., కాళ్లు మొక్కి పదవులు పొందడం నాకు చేతగాదు. ప్రాణం కన్నా నాకు ఆత్మగౌవరమే ముఖ్యం అందుకే అది లేనిచోట ఉండడం అనవసరం అని పార్టీ నుంచి వెళ్లిపోతున్నానని రాజయ్య యాదవ్ తెలిపారు. కేసీఆర్ ఇంటి నుంచి ముగ్గురు మంత్రులున్నారు.., అలాంటప్పుడు ఇతరుల బాధలు వారికేమి తెలుస్తాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా తెలంగాణలోని ఉద్యమకారులంతా ఆత్మగౌరవం కోసం ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని రాజయ్యయాదవ్ పిలుపునిచ్చారు. తాను ఏ పార్టీలో చేరబోయేది భవిష్యత్తే నిర్ణయిస్తుందని, ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా ప్రజా ముఖంగా ప్రకటిస్తానని రాజయ్య యాదవ్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments