Monday, November 25, 2024
Homeలేటెస్ట్ న్యూస్’తూర్పు‘ పంచాయితీ రామన్న తేల్చేనా.?

’తూర్పు‘ పంచాయితీ రామన్న తేల్చేనా.?

 నరేంద్రుడి ఇలాకాలో రాముడు రాజీ కుదర్చేనా..?
తూర్పు లొల్లిపై నీళ్లు చల్లుతాడా.., నిప్పులు చెరుగుతాడా..?
వరంగల్ కేంద్రంగా గులాబీలో ప్రచ్ఛన్నయుద్ధం..
మంత్రికి, ఎమ్మెల్యేకి చెడిన వైనం..

రాష్ట్రంలోనే ఇప్పుడు ‘తూర్పు’ ఓ సంచలనం. పైకి బాగానే ఉందని కలరింగే గానీ, లోపల మాత్రం మొత్తం చెడిన వాతావరణమే. నాయకులంతా పక్కపక్కనే ఉన్న ఫీలింగ్ గానీ, తీక్షణగా చూస్తే కాళ్ల కింద భూమి కంపించే అగాథం. నియోజకవర్గంలో అతిరథ మహారథులు ఉన్నారనే పేరే గానీ ఎవరికి వారే అన్న తీరు. ప్రస్తుతం జరుగుతున్న తంతు చూస్తే ఎవరికైనా పార్టీ పరిస్థితి ఏంటనే అనుమానాలే. మంత్రి కేటీఆర్ నగరానికి రానున్న దృష్ట్యా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు పార్టీ ఇతర ప్రముఖులకు మధ్య ఏర్పడిన ఆ గ్యాప్ పెరుగుతుందా.. తగ్గుతుందో అర్థం కాని పరిస్థితి. మొత్తంగా జనాలు మాత్రం రామన్న వస్తున్నాడు.., రగులుతున్న మంటలను ఆర్పుతాడు.., నాయకుల మధ్య సఖ్యతను కుదురుస్తాడు.., కారు ప్రయాణం బ్యాలెన్సింగ్ తప్పకుండా హితబోధ చేస్తాడని గంపెడాశతో ఎదురు చూస్తున్నారు.
స్పాట్ వాయిస్, ప్రధాన ప్రతినిధి: రామన్నా.., వెల్ కమ్ టు ఓరుగల్లు. అయ్యో ఓరుగల్లు అన్నామని మీరేం తప్పు పట్టొద్దన్నా. ఇప్పుడు వరంగల్ అన్నామనుకో హన్మకొండోళ్లకు కోపం.., హన్మకొండ అన్నామనుకో వరంగల్లోళ్లకు పగ. అందుకే మధ్యే మార్గంగా ఓరుగల్లుకు స్వాగతం అని అన్నా. మీరు అపర భాషా కోవిదులు. ఆ మాత్రం అర్థం చేసుకోరా ఏంది. మాకు ఆ దిగులేం లేదు గానీ, మా బాధంతా ఇప్పుడు వరంగల్లో జరుగుతున్న అంతర్యుద్ధం గురించే అన్నా. మీ దాక వచ్చిందో లేదోగానీ, మాకు మాత్రం నిత్యం అదే దరువు. ఎటు చూసినా అవే దృశ్యాలు. మన పార్టీ పెద్దమనుషులంతా కలివిడిగా ఉండి ఇతర పార్టీల వాళ్లకు చుక్కలు చూపించాల్సింది పోయి.., విడివిడిగా ఉంటూ వాళ్లకే అవకాశం ఇస్తూ, వార్తల్లో వ్యక్తులుగా నిలువబట్టే. ఇదేందన్నా.. పరువు పోయే కథగాకపోతే..

రామయ్యా.. ఇదిగో తూర్పు నియోజకవర్గం. ఇక్కడ ఏం జరుగుతుందో మీ దృష్టికి వస్తుందో లేదోగానీ, అటు పార్టీ శ్రేణులు, ఇటు స్థానిక ప్రజలు మాత్రం నలిగిపోతున్నారయ్యా. మీరు వస్తారని మొన్నటి వరకు మొదట కేఎంసీ మైదానంలో పరిశీలనలు చేశారు. ఆ సమయంలో కూడా మొదట మంత్రి ఎర్రబెల్లి గ్రౌండ్ కు వెళ్తే, ఆ పూట నన్నపునేని కనిపించ లేదు. ఎమ్మెల్యే గారూ మీ రాక కోసం జరుగుతున్న పనులను చూడడానికి వెళ్లినప్పుడు మంత్రి ఎర్రబెల్లి కనిపించలేదు. మా పాపపు కళ్లతో ఇద్దరిని మెడికల్ కళాశాల మైదానంలో చూద్దామంటే ఆ భాగ్యం కలుగలేదయ్యా.

ఏమైందో ఏమో, ఉన్నఫళంగా మీరు రావాల్సిన వేదిక రాత్రికి రాత్రే కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (కుడా) గ్రౌండ్ కు షిఫ్ట్ అయ్యింది. సరే అది మారిందా.. కావాలనే మార్చారా.. అనేది మాకెందుకు గానీ, అదో పెద్ద చర్చే అయ్యింది. మీటింగ్ నన్నపునేని నరేందర్ ఇలాఖాలో కాకుండా కావాలనే చేంజ్ చేశారని అంతా బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు.
సరే అదీ పోని. ఎక్కడైతేంది. మీరొచ్చే సరికి మా నాయకులంతా కలిసి ఒక్కసారన్నా ఒక్క గ్రూపు ఫొటోలా కనిపిస్తే చూసుకుని తరిద్దామనుకుంటిమి. అయినా ఇక్కడ కూడా అదే తంతు. వరంగల్ లో ఎట్లైతే జరిగిందో హన్మకొండలో కూడా అదే సీన్ రిపీట్ కావట్టే. మైదాన పరిశీలన ఏమోగానీ, మీ రాక సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లపై మీడియా సమావేశం పెట్టబోతున్నారని తెలిసి అందరం ఆశగా అక్కడికి పరుగెత్తితిమి. తీరా చూస్తే వేదికపై యోధానయోధులు కనిపిస్తాండ్రు గానీ, గా తూర్పు ఎమ్మెల్యే నరేంద్రుడు ఏడా కానరాడయో అని చూపంతా గుమ్మంకేసే పెడ్తిమి. ఇగ వస్తడో, అగ వస్తడో.., నడిమిట్ల ఎక్కడన్నా ఆగిండో.., లేదంటే ట్రాఫిక్ ల గిట్ల ఇరుక్కున్నడో.. అని మాకు మేమే తీవ్రంగా సముదాయించుకుంటా మీటింగ్ అయిపోయేదాకా ఎదురు సూసుకుంటా కూసుంటిమి. అది అయిపోయినా నన్నపునేని గారు మాత్రం రాకపోయో. ఇక ఇప్పటికి ఇంతేలే అని ఉసూరుమనుకుంటూ బయటికెళ్తిమి. ఇదంతా మీకు తెలియజెప్పడానికే ఈ మా తాపత్రయం కేటీఆర్ సారూ…

ఎవరిది ఏ దారో..?
మంత్రి కేటీఆర్ రాక సందర్భంగా ఏర్పాట్లపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో హోటల్ హరిత కాకతీయలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ అతిరథమహారథులు హాజరయ్యారు. వేదికను అలంకరించిన పెద్దలంతా మంత్రి పాల్గొనబోయే మీటింగ్ సంబంధించిన వివరాలు వెల్లడించారు. కానీ, అతి కీలకమైన ఈ సమావేశానికి తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ రాకపోవడం వెలితిగానే కనిపించింది. కొద్ది రోజులుగా తూర్పు నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తమ్ముడు ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. ఆ మాటకొస్తే నన్నపునేని ఒక్కడు ఒక వైపుగా చలామణి అవుతుంటుండగా, ప్రదీప్ రావు, మేయర్ సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, వద్దిరాజు రవిచంద్ర వంటి హేమాహేమీలంతా మరోవైపు అనే టాక్ నడుస్తోంది.

జర.. మీరే చక్కదిద్దాలే..
అయ్యా.. కేటీఆర్ సారూ.. మీరన్నా గా తూర్పు దిక్కు కాస్త చూడండి. వాళ్ల మధ్య లొల్లెందుకైతాందో తెలుసుకోండి. పెద్దరికంగా మీరు కూసోబెట్టి, సమస్యను పరిష్కరించండి. మాకైతే పార్టీ పరిస్థితి చూస్తే గుండె తరుక్కపోతాంది. మీరన్నా అందరిని గాడిలో పెట్టి ఈస్ట్ లో మనమే ది బెస్ట్ అనే సంకేతాలు ఇవ్వండి. రాబోయే ఎన్నికల నాటికి అంతా ఒక్కతాటిపై నడిచేట్టు చేయుండ్రి. అలా చేస్తారని ఆశిస్తున్నాం సారూ….

ఇట్లు
తూర్పు నియోజకవర్గ ఓటర్లు అండ్ మహానగర ప్రజలు

RELATED ARTICLES

Most Popular

Recent Comments