పరీక్షకు అనుమతి దొరికేనా..?
సభలో కేటీఆర్ ప్రకటన కోసం ఎదురుచూపు..
స్పష్టత ఇవ్వకుంటే పోరు మరింత తీవ్రమేనా..
స్పాట్ వాయిస్, భూపాలపల్లి ప్రతినిధి: అందరి చూపు భూపాలపల్లి నియోజకవర్గంపైనే ఉంది. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో చర్చంతా నియోజకవర్గంపైనే నడుస్తోంది. బీఆర్ఎస్ లో వర్గపోరు.. ఎన్నికలు దగ్గర్లోనే ఉండడంతో టికెట్ అంశం తెరపైకి వచ్చింది. అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డితో పాటు ఎమ్మెల్సీ సిరికొండ మధు సూదనాచారి సైతం పోటీ పడుతున్నారు. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. తమ వర్గీయులతో ఉనికి చాటుకునేందుకు తెరచాటు పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భూపాలపల్లి నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది.
హాల్ టికెట్ వచ్చేనా..?
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కొద్దినెలల క్రితం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. తాను కఠిన పరీక్ష రాస్తున్నానని,దానికి ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారితో పాటు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు సహకరించాలని కోరారు. అప్పట్లో ఈ విషయం హాట్ హాట్ చర్చగా మారింది. నియోజకవర్గంలో గండ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారనే అంశం అంతటికీ పాకింది. అయితే ఇప్పడంతా గండ్రకు హాల్ టికెట్ వచ్చేనా అనే చర్చజరుగుతోంది. ఒకవేళా వస్తే ఇంటి పోరుతో పరీక్ష నెగ్గేనా.. అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి ప్రకటించేనా..
మంత్రి కేటీఆర్ ఇటీవల హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. అభివృద్ధి పనుల అనంతరం జమ్మికుంటలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించకనే ప్రకటించారు. ఆరు నెలలు బాగా కష్టపడితే నువ్వే ఎమ్మెల్యే అవుతావంటూ చెప్పారు. దీంతో వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గం టికెట్ కౌశిక్ రెడ్డికి అనేది కన్ఫాం అయింది. ఈ క్రమంలో గురువారం మంత్రి కేటీఆర్ భూపాలపల్లిలో పర్యటించనున్నారు. అభివృద్ధి పనుల ప్రారంభం అనంతరం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ప్రకటించినట్లుగానే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనే గుట్టు విప్పుతారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. గుట్టువిప్పకపోతే టికెట్ పై మరింత సస్పెన్షన్ కొనసాగి.. గండ్ర, సిరికొండ వర్గాల మధ్య పోరు మరింత తీవ్ర కానుంది. ఒక వేళా టికెట్ ఇండికేషన్ ఇస్తే సిరికొండ వర్గీయులు, గులాబీ జెండా మొదటి నుంచి మోస్తున్న వారి నుంచి నిరసన వెల్లువెత్తే ప్రమాదం లేకపోలేదు.
ఇంటి పోరు తట్టుకునేనా..!
భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ సిరికొండ వర్గీయులు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ కవిత పర్యటనలో శిలాఫలకంపై ఎమ్మెల్సీ పేరు లేదని రచ్చ చేశారు. కవిత ముందు నెట్టేసుకున్నారు. అంతేకాదు.. సిరికొండ దూకుడు పెంచి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మరి గండ్రకు టికెట్ ఇస్తే.. సిరికొండ వర్గీయులు సహకరిస్తారా అనేది ప్రశ్నగా మారింది. వచ్చే ఎన్నికల్లో చాలా టఫ్ ఉండనున్న నేపథ్యంలో మరి గండ్ర ఇంటి పోరు గెలిచి విజయబావుటా ఎగువేస్తారా లేక.. ఇద్దరు కొట్లాడుకొని ప్రతిపక్షానికి అధికార పీఠాన్ని అప్పజెబుతారో చూడాలి మరి.
Recent Comments