తల్లిని చంపిన కొడుకు..
కొడుకును చంపేసిన స్నేహితులు..
గడ్డి అన్నారం చోరీ కేసులో కొత్తకోణం..
మిస్టరీని ఛేదించిన రాచకొండ పోలీసులు
పెంచిన కొడుకే పామయ్యాడు..
స్పాట్ వాయిస్, బ్యూరో: పాలు పోసి పెంచిన ప్రేమ విషంగా మారింది. సంతానం లేదని దత్తత తీసుకున్న కుమారుడు జల్సాలకు అలవాటు పడి తల్లి ప్రాణాలే తీసిన యముడయ్యాడు. ఆ తర్వాత స్నేహితుల చేతిలో తాను బలయ్యాడు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకున్న ఈ హత్యల మిస్టరీని పోలీసులు ఛేదించారు. పలువురిని అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలు పోలీసుల కథనం ప్రకారం.. సరూర్‌నగర్‌లోని న్యూగడ్డి అన్నారం కాలనీకి చెందిన జంగయ్య యాదవ్, భూదేవి అలియాస్ లక్ష్మి దంపతులు. జంగయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారిగా బాగానే సంపాదించారు. వారికి సంతానం లేదు. దీంతో సాయితేజను దత్తత తీసుకొని పెంచుకొంటున్నారు. అతడికి బుద్ధి మాంద్యం. జంగయ్య దగ్గర డ్రైవర్ గా పనిచేసే నరసింహతో కలిసి సాయితేజ చెడుమార్గాల్లో పడ్డారు. నరసింహ సాయితేజకు గంజాయి, అమ్మాయిలను పరిచయం చేసినట్టు సమాచారం. జల్సాలకు అలవాటుపడిన సాయితేజ తన స్నేహితులకు నగలు ఇవ్వటానికి తల్లిని చంపి, ఇంట్లోనే దొంగతనం చేయాలని చూశాడు. అతడికి నరసింహ జత కలిశాడు. ఈ క్రమంలోనే సహాయానికి నరసింహ తన స్నేహితులు శివ, చింటు, అంజి, సాయి గౌడ్‌ను పిలిచి ప్లాన్ చేశాడు. ఈ నెల 7న తెల్లవారుజామున సాయితేజ నరసింహకు ఫోన్ చేసి దొంగతనానికి రమ్మని పిలిచాడు. అందరూ కలిసి ఇంటి వెనకాల నుంచి ఫస్ట్ ఫ్లోర్‌లోకి వెళ్లారు. సాయితేజ, శివ కలిసి దిండుతో లక్ష్మికి ఊపిరాడకుండా చేయగా, నరసింహ చేతులను, సాయిగౌడ్, చింటు కాళ్లను అదిమిపట్టి ఆమెను చంపేశారు. తర్వాత నగలు, డబ్బుతో సహా గోడ దూకి పారిపోయారు. కింది అంతస్తులో నిద్రపోయిన జంగయ్య ఉదయంపైకి వెళ్లి చూడగా లక్ష్మి అపస్మారక స్థితికి వెళ్లింది. స్థానిక దవాఖానకు తరలించగా ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పడంతో గుండె పోటుతో అని భావించారు. అంత్యక్రియల కోసం ఆమె అల్మరా నుంచి చీర తీసేందుకు వెళ్లగా వస్తువులు చిందర వందరగా ఉండడం, నగదు, బంగారు ఆభరణాలు లేకపోవడం, కొడుకు కూడా కనిపించకపోవడంతో జంగయ్యకు అనుమానం వచ్చింది. దీంతో సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఊపిరాడకుండా చేసి చంపారని ప్రాథమికంగా తేల్చారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా, సాయితేజ ఘాతుకానికి పాల్పడ్డట్టు తేలిపోయింది. కాగా, సాయితేజకు బుద్ధి మాంద్యం ఉండడంతో ఎప్పటికైనా పోలీసులకు చెప్తాడని భావించిన నరసింహ చంపేయాలని శివకు చెప్తాడు. అవసరమైతే దొంగిలించిన సొమ్ములో వాటా ఎక్కువ ఇస్తానని ప్రలోభ పెడుతాడు. దాంతో శివ సాయితేజను తీసుకొని శ్రీశైలం వెళ్లి అక్కడ సాయితేజ తలనీలాలు ఇప్పిస్తాడు. ఈ నెల 10వ తేదీన అమ్రాబాద్ అడవిలోని మల్లెల తీర్థానికి వెళ్లి అక్కడ ఇద్దరూ ఫుల్ గా మద్యం సేవిస్తారు. అక్కడే శివ రాయితో సాయితేజను కొట్టి చంపి మృతదేహాన్ని నీళ్లలో పడేస్తాడు. అనంతరం తనంతట తానే పోలీసులకు లొంగిపోయి జరిగిన విషయం మొత్తంగా చెబుతాడు. ఈ సందర్భంగా శివ దగ్గర నుంచి రూ.1.4 లక్షల విలువైన హారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని, అతడు చెప్పిన వివరాలతో మల్లెలతీర్థానికి వెళ్లి సాయితేజ మృతదేహన్ని గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట దవాఖానకు తరలించి, నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Recent Comments