Monday, November 25, 2024
Homeటాప్ స్టోరీస్భయాన్ని మరుస్తున్న బాధ్యత..

భయాన్ని మరుస్తున్న బాధ్యత..

భయాన్ని మరుస్తున్న బాధ్యత..

బంధం బాగున్నన్ని రోజులు బలం గురించి మాట్లాడుకోవడం.. బ్రేకప్ ఆనవాళ్లు కనిపించిన నుంచి బలహీనతలను విస్మరించడం భయం లేనితనం. కలుపుకుని పోవాలంటే భరిస్తూ సాగడం.., కలవడం కష్టమనిపిస్తే అరుస్తూనైనా సాగనంపడం తప్పనిసారి. నీకు నేను దూరమవ్వాలనిపిస్తే, నాకు నువ్వు దూరం కానవసరం లేదు. పక్కనే ఉండి చేయాల్సింది చేస్తే సరిపోతుంది. బలగం కనిపించినన్ని రోజులు బలంగా మురవడం పరిపాటే. సైన్యం పెరుగుతున్నన్నాళ్లూ విర్రవీగి ప్రవర్తించడం సహజమే. అడ్డం తిరగనంత వరకు అంతా సవ్యమే. ఆటంకం కలిగితేనే అవగాహన లోపం బయట పడేది. కలిసి సాగితేనే లోపలైనా పాపం వదిలేయ్ అన్నట్టుగా ఉంటుంది. విడదీసి చేయాలనుకుంటే అన్నీ అవకాశంగా మలుచుకునే సందర్భాలే..

నెపాన్ని నెట్టడం ఎంతో తేలిక. నడిపిస్తూ నాయకుడిగా ముందుకు సాగడం కొంతమందికే ఎరక. సమస్యలు వచ్చినప్పుడు చేతులెత్తేసే చేజారిపోవడం తప్పని పరిస్థితి. వచ్చిన సమస్యను చేతి లోకి తీసుకుంటే అంతా గుప్పిటనే ఉండి., అల్లకల్లోలాలకు ఆస్కారం అస్సలే ఉండదు. ఈ చేతి కి ఆ చేయి ఎంత దూరమో,, ఆ చేతికి ఈ చేయి అంతే దూరమన్నట్టు.., బీజాలు వేసేది మీరంటే మీరు అనుకుంటే కార్యాలు ముందుకు సాగవు. అదీకాకుండా జరగాల్సిన నష్టం కళ్లముందే వెక్కిరిస్తూ నాట్యం చేస్తుంది. చేతుల మధ్య ఎడాన్ని చెరిపేయడం అప్పటికి కష్టతరమైనా, దానికి సాకుగా చూపుతూ అసలు సమస్యను పెంచే అవకాశాలు ఎవరికీ ఇవ్వకుంటే అంతక న్నా పరిష్కారం మరేమీ ఉండదు.

జ్వాలలు అంటుకున్నాయనేది కళ్లముందు కనిపిస్తున్న సాక్షిభూతాలు. వాటికి ఆజ్యం పోసింది ఎవరు.. ? ఆజ్యాన్ని అందిస్తూ తగలబడుతున్న మంటల ను తనవితీరా ఆస్వాదిస్తున్నది ఎవరు..? చలికి వెచ్చదనాన్ని ఇచ్చే మంటలైతే అందరికీ సంతోష మే.., కానీ నిలువెళ్లా తనువులను దహించే కీలలైతేనే ప్రమాదం. ఇప్పటికే ప్రకోపిస్తున్న ప్రకృతి ముందు మోకరిళ్లి ప్రాదేయపడుతున్నా కాస్త కనికరిస్తున్న దాఖలాలు కనిపిస్తున్నది చాలా తక్కువ సమయాల్లోనే. దానిని చెరబడుతూ అభివృద్ధి అనే ముసుగులో ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చుకుంటున్న అపర మేధావులమై ఉండి ఇప్పుడు లెక్కకు మిక్కిలి స్వయం కృతాపరాధాలు చేసుకోవడం విచక్షణకే వదలాల్సిందేనా..?

ఇప్పటికే కరోనా కోలుకోలేని దెబ్బకొట్టింది. లక్షల జీవితాలు పిట్టల్లా రాలాయి. కోట్లాది కుటుంబా లు నడీరోడ్డున పడ్డాయి. స్థాయేంటో తెలియజె ప్పి ఒళ్లు దగ్గరపెట్టుకో అని హెచ్చరించింది. అ యినా బుద్ధొచ్చినట్టుగా మాత్రం కనిపించడం లే దు., కుక్క తోకకు గుండు కడితే సక్కగొస్తుం దా.. అన్న తీరుకు మించి అనిపించడం లేదు. మహమ్మారి దెబ్బతో ఆర్థికం మొత్తం అధ:పాథాళానికి చేరి, ఇప్పుడప్పుడే కోలుకునే పరిస్థితి కూడా దరిదాపుల్లో కనిపించడం లేదు. మరి నే ర్చుకున్నదేంటి.., నడుచుకోవాల్సింది ఎలా..? తగిలిన దెబ్బ నుంచి గుణపాఠం నేర్వాల్సిన జీవుడు అంతకు మించి దెబ్బలను తగిలించుకునేందుకే ఉబలాటపడుతున్నాడు. తప్పుల మీద తప్పులు చేస్తూనే తెలివిమాలిన తనాన్ని తెలివిగా ప్రదర్శిస్తున్నాడు.

పాలకుల పైశాచికానికి పసిడి లాంటి ప్రాయాలు పండిపోతున్నాయి. జరగకూడనివన్నీ జరుగుతూనే ఉన్నాయి. దేశం తగలబడిపోతున్నది. శత్రు మూకలతో తలపడాల్సిన యువత స్వదేశంలోనే వైరి వర్గాన్ని ఎంచుకుంటున్నది. వ్యవ స్థను సంస్కరించాల్సిన నేతలు మాత్రం ‘కును కు’ తీస్తూ వేడుక చూస్తున్నారా.. నెపాన్ని నెట్టేయొచ్చులే అనే విపరీత ధోరణికి అలవాటు పడి తాత్కాలికంగా ఒడ్డులు చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారా..? అనిపిస్తోంది. మంచి జరుగుతున్నప్పుడు ఎవరూ పట్టించుకోకపోవచ్చు.., కానీ చెడు కార్యాలు జరిగితేనే ప్రతీ వారు ఒళ్లంతా కళ్లు చేసుకుని అన్ని విషయాల్ని తీక్షణగా పరిశీలిస్తారు. ఒక్కసారి అదుపు తప్పిందన్న అనుమానాలు వారి మనుస్సును తాకితే ఇక బీజాలను పెంచి పెద్దవిగా చేస్తూ చల్లారడానికి అవకాశం ఉన్న చిన్నచిన్న మంటలను కూడా బడబాణలాలుగా మలుస్తారు.

కనీసంగానైనా క్లారిటీ లేని విషయాలు సమాజం మీద దండయాత్ర చేస్తూ పైచేయి సాధించడానికి ఉవ్విళ్లూరుతున్నాయి.తప్పదోవ పట్టిస్తున్నారా..? తప్పుగా చూపుతున్నారా..? అనేది ఆలోచించే స్థితి ఆవిరవుతున్నది. ‘‘కేంద్రం, రాష్ట్రం మధ్యలో జనాలకే నష్టం’’ అన్న మాదిరిగా తయారైంది. అసలే ఉడుకు రక్తం., ఏదైనా సాధించే సత్తా ఉన్న వయస్సు. అంత తేలిగ్గా వదులుకోని పట్టుదల. సరిగ్గా ఉపయోగించుకుంటే అభివృద్ధి చెందుతున్న దేశం ఎప్పుడో అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో కలవాల్సిన పరిస్థితి. కానీ దశాబ్దాలుగా దేక్కుంటు.., దేక్కుంటూ ‘డెవలపింగ్’ గానే ఉంటోంది. పోటీ పెరుగుతున్న మాట ఎంత నిజమో.., పోటీలో మనల్ని మనమే నిలవరించుకుంటూ పక్కనోడికి సునాయాసంగా విజయాన్ని దక్కేలా చేస్తున్నది కూడా అంతే నిజం.

బంగారు భవిష్యత్ ను ఊహించుకుంటూ జీవితాలను సాగించాల్సిన తల్లిదండ్రులు అర్ధంతరంగా రాలుతున్న ఆకులను కనుపొర నుంచి చెరిపేయలేక దుర్భరమైన బతుకులు సాగిస్తున్న తీరిది. బంగారు నేలను ముద్దాడాల్సిన ప్రాయాలు జీవిడిసిన ముద్దగా నేల పొరల్లో నిద్రించాల్సి వస్తోంది. కన్నవారికి కడుపు మంటను మిగులుస్తూ.., కన్నభూమికి సేవలు అందించే అవకాశాన్ని తుంచేస్తూ వ్యవస్థ సాధిస్తున్నది ఏంటో నేతలే అర్థం చేసుకోవాలి. తాత్కాలికంగా ఉండిపోయే పదవుల పందేరంలో వైరాన్ని పెంచిపోషించకుండా, స్నేహానికి ఊతమిచ్చేలా చర్యలుండాలి. కాపాడుకోవాల్సిన యువతను కాలరాస్తే తిలా పాపం తలా పిడికెడు అనే గుర్తెరగాలి. రంగులు మార్చే పందెంలో దేశ ‘భవిష్యత్’కు మాత్రం ఏ రంగూ అంటుకోకుండా చూడాల్సిన అవసరం ప్రతీ ఒక్కరిపై ఉందని గమనించాలి. అప్పుడు జరిగేది అభివృద్ధి అనిపించుకుంటుంది.., నడిచేది సామరస్యమైన కాలంగా నిలిచిపోతుంది.

                                                                                      ..చేలిక రాజేంద్ర ప్రసాద్ – ఎడిటర్

RELATED ARTICLES

Most Popular

Recent Comments