కాసుల కక్కుర్తి
చిరుతను చంపేశారు..
చర్మాన్ని విక్రయించేందుకు యత్నం
ఆరుగురిని పట్టుకున్న పోలీసులు
వివరాలు వెల్లడించిన ఎస్పీ సురేందర్ రెడ్డి
స్పాట్ వాయిస్, భూపాలపల్లి: చిరుతను చంపడంతో పాటు దాని చర్మాన్ని విక్రయించేందుకు యత్నించిన ఆరుగురిని మహాదేవపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు శుక్రవారం భూపాలపల్లి ఎస్పీ సురేందర్‌రెడ్డి వివరాలను వెల్లడించారు. జిల్లాలో అటవీ, పోలీస్ శాఖ సమన్వయంతో వన్యప్రాణుల రక్షణ కొనసాగుతుందన్నారు. ఈ మేరకు కాటారం డీఎస్పీ రాం మోహన్ రెడ్డి పర్యవేక్షణలో మహాదేవపూర్ సీఐ టి. కిరణ్ , మహదేవ్ పూర్ ఎస్సై ఎన్. రాజ్ కుమార్, సిబ్బంది తో ప్రత్యేక టీంను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఉచ్చు పెట్టి..
కొద్ది రోజుల నుంచి చత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా హుసూరు తాలూకా పామేడ్ గ్రామ శివారులోని అడవిలో చిరుతపులి తిరుగుతోందని ప్రజలందరూ అనుకుంటుండగా అది గమనించిన ములుగు జిల్లాకు చెందిన పొలం వెంకటేష్, ఇరుప నాగేంద్రబాబు చిరుత పులిని ఎలాగైనా చంపి దాని చర్మాన్ని విక్రయించి పెద్ద మొత్తంలో సులువుగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసుకున్నారు. ఈ మేరకు ఉచ్చులు పెట్టగా..చిరుత చిక్కింది. దీంతో దాన్ని చంపి చర్మాన్ని తీశారు. కొంతమంది సాయంతోమహారాష్ట్రలో విక్రయించేందుకు తెలిసిన వారిని కలవడానికి మహాదేవపూర్ ప్రాంతానికి వస్తున్నారనే సమాచారం మేరకు నిఘా వేసి మహాదేవపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న బ్యాగ్ ని పరిశీలించగా.. ఎండ బెట్టిన చిరుత పులి చర్మం కనిపించింది. వారి నుంచి చిరుత పులి చర్మం స్వాధీనం చేసుకొని వారిని స్టేషన్ లో విచారించారు. దీంతో వారు నేరం చేసినట్టు ఒప్పుకున్నారు. కొత్తగూడెం, ములుగు, ఈస్ట్‌గోదావరి జిల్లాలకు చెందిన ఇరుప నాగేంద్రబాబు అలియస్ చంటి, పొలం వెంకటేశ్, పరిసబోయిన రాజేశ్, ఎర్రగట్ల శ్రీకాంత్, బుర్రి సాయికిరణ్, బొమ్మకంటి కిశోర్ అనే ఆరుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. పొలం వెంకటేశ్, ఇరుప నాగేంద్రబాబు అనే ప్రధాన నింధితులు చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని పామేరు అటవీ ప్రాంతంలో చిరుత పులిని చంపి ఎండబెట్టి విక్రయానికి పూనుకున్నారని ఎస్పీ వెల్లడించారు. మరో నలుగురు సహాయంతో విక్రయానికి బయలు దేరగా అరెస్టు చేసినట్లు వివరించారు. వారి వద్ద నుంచి పులిచర్మం, మోటార్ సైకిళ్లు, సెల్ ఫోన్ లు, మూడువేల నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన మహాదేవపూర్ సీఐ టి. కిరణ్, ఎస్సై. రాజ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ రాజేందర్, కానిస్టేబుళ్లు ధనుంజయ్, కిషన్, శ్యామ్, కిరణ్, అన్వేష్ ను ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాస రావు, కాటారం డీఎస్పీ రాంమోహన్ రెడ్డి , ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.
Recent Comments