Friday, November 22, 2024
Homeజిల్లా వార్తలునిరుద్యోగుల సంఘటితశక్తి చాటాలి

నిరుద్యోగుల సంఘటితశక్తి చాటాలి

నిరుద్యోగ మార్చ్ విజయవంతం చేద్దాం
బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుర్శెట్టి సంపత్
స్పాట్ వాయిస్, హన్మకొండ: నిరుద్యోగుల సంఘటిత శక్తిని రాష్ర్ట సర్కార్ కు చూపెట్టాలని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుర్శెట్టి సంపత్ అన్నారు. బీజేవైఎం హన్మకొండ జిల్లా అధ్యక్షుడు తీగల భరత్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం నిరుద్యోగ మార్చ్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దుర్శెట్టి సంపత్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కేసీఆర్ ప్రభుత్వానికి నిరుద్యోగుల ఐక్యతను చూపెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈనెల 15న తలపెట్టిన నిరుద్యోగుల మార్చ్ విజయవంతం చేయడానికి నిరుద్యోగులందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారాలతో నిరుద్యోగుల జీవితాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎనిమిదిన్నర సంవత్సరాల తర్వాత వేసిన ఉద్యోగ నోటిఫికేషన్లకు లక్షలాదిమంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని, ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో నిరుద్యోగులు రాత్రింబవళ్లు శ్రమించి పరీక్షలకు ప్రిపేర్ అయితే పేపర్లను లీక్ చేసిన నిరుద్యోగులను ఆగం చేశారన్నారు. పేపర్ లీకేజీతో నిరుద్యోగులు నట్టేట మునిగిపోయారన్నారు. కోచింగ్ సెంటర్లకు, స్టడీ మెటీరియల్ కు వేలాది రూపాయలు ఖర్చు చేసి పరీక్షలకు సిద్ధమయ్యారని చెప్పారు. నిరుద్యోగులను ఆదుకోవాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని, నిరుద్యోగ భృతి రూ.3016 ప్రతీనెల అందిస్తామని 2018 ఎన్నికల సమయంలో ప్రకటించి నేటికి ఆ హామీని అమలు చేయలేదని మండిపడ్డారు. నిరుద్యోగులను కేవలం ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి నాడు ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి ప్రకటించి కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. అందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిరుద్యోగులందరికీ అండగా నిలవడానికి, భరోసా కల్పించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. నిరుద్యోగులకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి, పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, నష్టపోయిన నిరుద్యోగులకు లక్ష రూపాయల పరిహారం అందించాలని, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ ను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 15న తలపెట్టిన నిరుద్యోగ మార్చ్‌కు నిరుద్యోగులు భారీ సంఖ్యలో తరలిరావాలన్నారు. ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకూ బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో నిరంతర పోరాటాలు చేస్తామన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments