అభ్యర్థుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం
మండిపడిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి
మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ఎదుట ధర్నా
మార్చితే ఇబ్బందేంటని ప్రశ్న..?
స్పాట్ వాయిస్, బ్యూరో: టెట్ పరీక్ష తేదీ మార్చాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. టెట్,ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ ఒకే రోజు ఉండడంతో టెట్ పరీక్ష తేదీని మార్చాలంటూ ఆయన శుక్రవారం మంత్రి ఇంటి ఎదుట ఆయన ఎన్ ఎస్ యూఐ కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు రోజుల క్రితం విద్యార్థులు, ప్రజల సమస్యలు చెప్పేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి సబితారెడ్డిని అపాయింట్ మెంట్ అడిగామని, కానీ ఇవ్వడం లేదన్నారు. ఇక్కడ సరికొత్త పాలన నడుస్తుందోంటూ ధ్వజమెత్తారు. టెట్ నోటిఫికేషన్ నెల రోజుల క్రితం వచ్చిందని, ఆర్ఆర్ బీ నోటిఫికేషన్ ఏడాది క్రితం వచ్చిందని చెప్పారు. ఈ రెండు పరీక్షలు రాసే అభ్యర్థులు మూడు లక్షల మంది ఉన్నారని, అయితే ఒకే రోజు ఈ రెండు పరీక్ష ఉండడంతో ఆర్ఆర్ బీ రెండో పరీక్షకు అభ్యర్ధులు హాజరు కాలేకపోతున్నారని చెప్పారు. ఆర్ఆర్ బీ రోజే టెట్ పెడితే ఎలా అంటూ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిని జగ్గారెడ్డి ప్రశ్నించారు. సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ హయాంలో బాధ్యతాయుతంగా పనిచేశారని, కానీ టీఆర్ఎస్ లో చేరి మంత్రి అయ్యాక ఇలా నిర్లక్ష్యంగా తయారయ్యారంటూ విమర్శించారు. టెట్ తేదీ మార్చడానికి ఇబ్బంది ఏంటి అని ఆయన ప్రశ్నించారు. ఒకటి రెండు రోజుల్లో పరీక్ష తేదీని మారుస్తూ ప్రకటన చేయాలని.. లేకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు. అభ్యర్థుల సమస్య చెప్పేందుకు మంత్రికి ఫోన్ చేస్తే.. కనీసం ఫోన్ ఎత్తడం లేదన్నారు ఆరోపించారు. సబితా ఇంద్రారెడ్డి వచ్చే వరకు ఇంటి ముందు ధర్నా చేస్తామని ఆయన ప్రకటించారు.
Recent Comments