Monday, November 25, 2024
Homeజనరల్ న్యూస్టెన్త్.. జవాబు పత్రాలు మాయం..

టెన్త్.. జవాబు పత్రాలు మాయం..

టెన్త్.. జవాబు పత్రాలు మాయం

ఆదిలాబాద్ జిల్లాలో ఘటన

స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్ :పదో తరగతి జవాబుపత్రాల కట్ట మిస్ అయింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో చోటు చేసుకుంది. పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేసింది.సోమవారం తెలుగు పరీక్ష రాసిన విద్యార్థుల జవాబు పత్రాల్లో ఒక కట్ట మాయమైనట్లు ఎస్సై భరత్‌ సుమన్‌ తెలిపారు. ఈ జవాబు పత్రాల కట్ట ఏ పరీక్ష కేంద్రానికి సంబంధించిందో తెలియరాలేదు. ఉట్నూరులో పరీక్ష రాసేందుకు 1,011 మంది విద్యార్థులకు అయిదు కేంద్రాలను ఏర్పాటుచేశారు. జవాబుపత్రాలను ఆయా కేంద్రాల బాధ్యులు తపాలా కార్యాలయంలో అప్పజెప్పారు. అక్కడి సిబ్బంది పత్రాలన్నింటినీ 11 కట్టలుగా విభజించి మూల్యాంకన కేంద్రాలకు తరలించేందుకు బస్టాండ్‌కు ఓ ఆటోలో తీసుకొచ్చారు. బస్సులో వేసే ముందు మరోసారి కట్టలను లెక్కించగా.. 11 బదులు పది కట్టలే ఉండడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. జవాబు పత్రాల కట్ట కోసం ప్రధాన రహదారితోపాటు అన్ని ప్రాంతాల్లోనూ వెతికారు. అది దొరక్కపోవడంతో తపాలా కార్యాలయ సబ్‌ పోస్టుమాస్టర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని, విద్యార్థుల భవిష్యత్తు ఏమిటని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments