Friday, September 20, 2024
Homeజాతీయంహస్తినలో తెలంగాణ

హస్తినలో తెలంగాణ

హస్తినలో తెలంగాణ
టీపీసీసీ ప్రెసిడెంట్, మంత్రి వర్గ విస్తరణపై చర్చలు
ఢిల్లీలోనే తిష్టవేసిన ఆశావహులు..
గాడ్ ఫాదర్ల చుట్టు ప్రదక్షిణలు..
నేడు కొలిక్కి వచ్చే ఛాన్స్
స్పాట్ వాయిస్, బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా హస్తినలో తిష్టవేశారు. ప్రస్తుతం హస్తంలో కొలువుజాతర నడుస్తుండడంతో.. ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఆశావహులంతా ఢిల్లీలో మకాం వేశారు. పెద్దలు, గాడ్ ఫాదర్లను కలుస్తూ పదవులు దక్కించుకునేందుకు శ్రమిస్తున్నారు. అత్యంత ప్రాధాన్యమైన పీసీసీ అధ్యక్ష పదవితో పాటు మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టుల నియామకానికి సంబంధించి హైకమాండ్ తో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన మూడురోజులుగా అక్కడే ఉండడంతో తెలంగాణ నేతలంతా ఆయనతో పాటు పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ఢిల్లీలో తిష్టవేశారు. ఐదుగురు మంత్రులతో పాటు పది మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలంతా హస్తినాలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు.
పీసీసీకి ఫుల్ డిమాండ్..
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి కోసం తీవ్ర పోటీ నడుస్తోంది. ఇప్పటి వరకు టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ కొనసాగుతున్నారు. ఆయన పదవి కాలం పూర్తికానుండడంతో పాటు.. సీఎం కావడంతో ఆయన స్థానంలో కొత్తవారిని నియమించేందుకు అధిష్ఠానం రెడీ అయింది. ఈ నేపథ్యంలో టీపీసీసీని ఆశిస్తున్న మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు హస్తినాలోనే ఉన్నారు. తమతమ పరిచయాలను వాడుకుంటూ పదవి దక్కించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డితో ఎంపీలు బలరాం నాయక్, సురేశ్ షెట్కార్లు సైతం రోజంతా సీఎంతో కలిసి పార్టీ పెద్దలను కలిశారు. ఇక టీపీసీసీ ఆశావహులు ఇటు రాష్ట్రంలోని ముఖ్య నాయకులతో కూడా సమావేశమై.. తమ పేరు ప్రతిపాదించాలని కోరుతున్నారు.
మంత్రి పదవి కోసం ఎమ్మెల్యేలు..
వచ్చే నెలలో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందనే లీకులు గుప్పుమన్నాయి. అంతేకాదు.. ఈమేరకు సీఎం రేవంత్ రెడ్డి, అధిష్టానం సైతం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అలర్ట్ అయిన నేతలు.. మంత్రి పదవి దక్కించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, పార్టీ చేరికల చేసిన వాగ్ధానాలను గుర్తు చేస్తూ.. మేమున్నామనే సంకేతాలు ఇస్తున్నారు. మంత్రి పదవి తమకు వస్తుందని చెప్పుకునే ఎమ్మెల్యేలు వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం కేసీ వేణుగోపాల్, సహా ఇతర పెద్దలను కలిశారు.

నేడు మరో ఇద్దరు ఢిల్లీకి..
రాష్ట్రంలోని కీలక పదవి అయిన టీపీసీసీతోపాటు మంత్రివర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి ఉండగా.. అధిష్టానం రాష్ట్రంలోని కీలక నేతలైన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది. తెలంగాణ కెబినెట్ తోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ఢిల్లీలో ఉండడంతో రాష్ట్ర కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments