స్పాట్ వాయిస్, కాజీపేట: సెప్టెంబర్ 17న నిర్వహించే తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.చుక్కయ్య కోరారు. కాజీపేట సెంటర్ లో ఆదివారం సీపీఎం పార్టీ సమావేశం జంపాల రమేష్ అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథిగా చుక్కయ్య హాజరైన మాట్లాడారు. సెప్టెంబర్ 17న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సభను సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనం ఎదుట గిరిజన కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్నామని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వాస్తవ చరిత్రను ప్రజలందరికీ తెలియజేయడం ఈ సభ ఉద్దేశమన్నారు. ప్రపంచం గర్వించదగ్గ మహత్తర సాయుధ పోరాటాన్ని నేడు చరిత్రను వక్రీకరించి హిందూ ముస్లిం సమస్యగా పాలకవర్గాలు ప్రచారం చేస్తున్నాయని, కానీ భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సాయుధ పోరాటం జరిగిందన్నారు. బిజెపి, ఆర్ఎస్ఎస్ లు దీనిని ఒక వివాదం చేసి రెచ్చగొడుతున్నాయని, విలీనమా, విమోచన, విద్రోహమా అన్న చర్చ సాగుతోందన్నారు. ఇలాంటి తరుణంలో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వాస్తవ చరిత్రను వివరించేందుకు వార్షికోత్సవ సభను నిర్వహిస్తున్నామన్నారు. సభకు సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం ముఖ్యఅతిథిగా హాజరవుతారని,కాజీపేట మండలం నుంచి భారీగా శ్రేణులను తరలిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ మండల కమిటీ సభ్యులు ఓరుగంటి సాంబయ్య, బి ఇందిరా, నాయకులు విమల, అనిత పాల్గొన్నారు.
Recent Comments