స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: టెట్ (టీచర్స్ ఎలిజబిలిటీ టెస్ట్) రాసే అభ్యర్థులకు టీ-సాట్ నెట్ వర్క్ చానెళ్లు స్పెషల్ ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేశాయి. ఏప్రిల్ నాలుగో తేదీ నుంచి జూన్ ఐదో తేదీ వరకు రెండు నెలలు 60 రోజుల పాటు పాఠ్యాంశాలు ప్రసారం కానున్నాయి. ఈ మేరకు టి-సాట్ నెట్వర్క్ చానెళ్ల సీఈవో శైలేష్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 8గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు అరగంట పాటు మొదటి పేపర్, ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది గంటల వరకు మరో అరగంట పాటు రెండో పేపర్ కు సంబంధించిన పాఠ్యాంశాలు టి-సాట్ విద్య చానల్ లో ప్రసారాలు ప్రారంభమై జూన్ 5వ తేదీన ముగియనున్నాయని చెప్పారు.
ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం..
సోమవారం నుంచి వారం రోజుల పాటు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం2 గంటల నుంచి నాలుగు గంటల వరకు టెట్ మొదటి, రెండో ప్రశ్న పత్రాలకు సంబంధించిన పాఠ్యాంశాలపై ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలుంటాయని శైలేష్ రెడ్డి వివరించారు. ఏప్రిల్ 4 నుంచి శనివారం వరకు ఆరు రోజుల పాటు 12 పేపర్లపై ప్రత్యేక అనుభవం కలిగిన వారితో అవగాహన పాఠ్యాంశ ప్రసారాలుంటాయని సీఈవో స్పష్టం చేశారు. తెలుగు, ఇంగ్లిష్, సోషల్ స్టడీస్, మెథడాలజీ, సోషల్ స్టడీస్ కంటెంట్, మ్యాథ్స్, సైన్స్, ఈవీఎస్, బయాలజీ, ఛైల్డ్ ఉడ్ డెవల్మెంట్ అండ్ పెడగాజీ సబ్జెక్టులపై పాఠ్యాంశాలు బోధిస్తారన్నారు. ఆరు రోజుల స్పెషల్ లైవ్ తో పాటు (రెండు నెలలు) 60 రోజులు, 120 పాఠ్యాంశ భాగాలు ప్రసారం చేయనున్నట్లు చెప్పారు. మాక్ టెస్ట్, (క్విజ్) ఇంట్రెస్టింగ్ జనరల్ నాలెడ్జ్ పేరుతో ప్రత్యేక ప్రశ్నావళి సిద్ధం చేసి టీ-సాట్ వెబ్ సైట్, ఛానళ్లు, యూట్యూబ్ ద్వారా అభ్యర్థులకు అందుబాటులోకి ఉంచినట్లు శైలేష్ రెడ్డి చెప్పారు.
Recent Comments