జెన్కోలో భూమి పోయినా.. ఉద్యోగం ఇవ్వలేదు..
భూ నిర్వాసితుడి ఆత్మహత్య
14 రోజుల క్రితం పురుగుల మందు తాగిన బాధితుడు
ఆస్పత్రిలో ఉండగానే.. ఉరి వేసుకున్న వైనం..
స్పాట్ వాయిస్, గణపురం/ భూపాలపల్లి టౌన్: ఉద్యోగం కోసం పోరాడితే.. చివరకు ప్రాణమే పోయింది. ఈ విషాదకర ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రేగొండ మండలం పొనగల్లుకు చెందిన మర్రి బాబు చెల్పూర్ సమీప గ్రామమైన మహబూబ్ పల్లిలో నివాసం ఉంటున్నాడు. కేటీపీపీ మొదటి ఫేజ్ లో బాబు తన భూమి కోల్పోయాడు. ఆ సమయంలో అతడి కొడుకు శ్రీకాంత్ మైనర్ కావడంతో ఉద్యోగం ఇవ్వలేదు. మేజర్ అయిన తర్వాత ఇద్దామని చెప్పిన అధికారులు ఆరేళ్లుగా తిప్పుకున్నారు. రోజు వచ్చి వెళ్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో విసిగివేసారిన మర్రి బాబు ఏప్రిల్ 1వ తేదీన పురుగుల మందు తెచ్చుకొని కేటీపీపీ గేటు ఎదుట తాగాడు.సెక్యూరిటీ సిబ్బంది అతడిని గమనించి ఆస్పత్రికి తరలించారు. ఇన్ని రోజులుగా మంజూరు నగర్ లోని స్మార్ట్ కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఆస్పత్రి బిల్లు రూ. 60 వేల వరకు అయింది. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న ఆ కుటుంబం బిల్లు కట్టలేకపోయింది. ఆస్పత్రి యాజమాన్యం సమాచారం ఇచ్చినా ఎవ్వరు రాలేదు. కేటీపీపీ యాజమాన్యం బిల్లు కట్టదనే ఆలోచన, ప్రాణాలకు తెగించినా ఉద్యోగం రాలేదనే ఆవేదనతో గురువారం ఉదయం ఆస్పత్రిలోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న భూపాలపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Recent Comments