స్పాట్ వాయిస్, గణపురం: గ్రామాభివృద్ధిలో భాగంగా విద్యార్థులు ఎన్‌ఎస్‌ఎస్ శిబిరాలు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని గణపురం ఎస్సై ఉదయ్ కిరణ్ అన్నారు. కర్కపల్లి గ్రామంలో భూపాలపల్లి డిగ్రీ కళాశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎన్ఎస్ఎస్ శిబిరం సోమవారం ముగింపు కార్యక్రమంలో ఎస్సై పాల్గొని మాట్లాడారు. మండల పరిధిలోని కర్కపల్లి గ్రామపంచాయతీలో భూపాలపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు సామాజిక సేవ చేయాలనే సంకల్పంతోనే ఎన్ఎస్ఎస్ శిబిరం నిర్వహించి పరిసరాల పరిశుభ్రత, మురుగు కాల్వల తొలగింపు, బాల్య వివాహాలపై అవగాహన, అక్షరాస్యత, బాల కార్మిక నిర్మూలన వంటి వాటిపై గ్రామస్తులకు వివరించాలన్నారు. సర్పంచ్ నగేష్, వాలంటీర్లు గ్రామంలోనే ఉంటూ సేవా కార్యక్రమాలు అందించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు కేవలం విద్య నేర్చుకోవడమే కాకుండా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అన్నిరంగాల్లో రాణించడం అవసరమని తెలిపారు. అనంతరం విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, చైల్డ్ మ్యారేజ్, జాబ్ గైడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సంధ్య, ఉప సర్పంచ్ మల్లేష్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి స్రవంతి, విద్యార్థులు పాల్గొన్నారు.
Recent Comments