Monday, November 25, 2024
Homeతెలంగాణకన్నతల్లిలా తెలంగాణ తల్లి విగ్రహం..

కన్నతల్లిలా తెలంగాణ తల్లి విగ్రహం..

గడీల అనవాళ్లు కనిపించొద్దని మార్పులు
డిసెంబ‌రు 9న తెలంగాణ బిడ్డల స‌మ‌క్షంలో వేడుక‌
పదేళ్లు పాలనచేసిన విగ్రహం ఏర్పాటు చేయలే..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

స్పాట్ వాయిస్,హైద‌రాబాద్‌: ప‌దేళ్ల పాటు పాలన చేసిన వాళ్లకు.., రూ.22.50 ల‌క్షల కోట్ల బ‌డ్జెట్ పెట్టిన వారికి రూ.కోటి పెట్టి స‌చివాల‌యంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసేందుకు మనసు రాలేద‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు. ప‌రిపాల‌న‌కు గుండెకాయ వంటి స‌చివాలయ ప్రాంగ‌ణంలో డిసెంబ‌ర్ 9వ తేదీన తెలంగాణ త‌ల్లి విగ్రహాన్ని ఘ‌నంగా ఆవిష్కరిస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ స‌మ‌యంలో జ‌రిగిన మిలియ‌న్ మార్చ్ త‌ర‌హాలో ల‌క్షలాది మంది తెలంగాణ బిడ్డల స‌మ‌క్షంలో విగ్రహాన్ని ఆవిష్కరిస్తామ‌ని ఆయ‌న‌ తెలిపారు. స‌చివాల‌యం ప్రాంగ‌ణంలో తెలంగాణ త‌ల్లి విగ్రహా ప్రతిష్టాప‌న‌కు భూమి పూజ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి బుధ‌వారం ఉద‌యం నిర్వహించారు. అనంత‌రం ఆయన మాట్లాడుతూ.. భూమి పూజ కార్యక్ర‌మాన్ని వైభ‌వంగా నిర్వహించాల‌నుకున్నామ‌ని, వేద పండితుల‌ను సంప్రదిస్తే బుధవారం మిన‌హా ద‌స‌రా వ‌ర‌కు మంచి రోజులు లేవని చెప్పార‌న్నారు. ముందుగా నిర్ణయించిన మేర‌కు ఉప ముఖ్యమంత్రి కేర‌ళ ప‌ర్యట‌న‌కు వెళ్లడం, మంత్రుల ఇత‌ర కార్యక్రమాల్లో బిజీగా ఉండ‌డంతో హడావుడిగా కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వ‌చ్చింద‌న్నారు.

కన్న తల్లిలా తెలంగాణ తల్లి విగ్రహం…
పదేళ్లు అధికారంలో ఉండి గ‌త పాల‌కులు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయలేద‌ని, సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని జూన్ రెండో తేదీనే తాను ప్రక‌టించాన‌ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కన్నతల్లిని తల‌పించేలా, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలనేది త‌మ అభిమ‌త‌మ‌ని ముఖ్యమంత్రి అన్నారు. దొర‌ల గ‌డీల ఆన‌వాళ్లు విగ్రహంలో ఉండ‌కూడ‌ద‌ని, అందుకే తెలంగాణ ప్రజ‌ల అభిమ‌తానికి త‌గిన‌ట్లు తెలంగాణ త‌ల్లి విగ్రహం రూపొందించే బాధ్యతను తెలంగాణ బిడ్డ, జేఎన్ టీయూ ఫైన్ ఆర్ట్స్ విభాగం క‌ళాశాల ప్రిన్సిప‌ల్‌కు అప్పగించామ‌ని ముఖ్యమంత్రి తెలిపారు. డిసెంబర్ 9న ఆవిష్కరిస్తామ‌ని, ఆరోజు తెలంగాణ ప్రజలకు పండగ రోజు అని ముఖ్యమంత్రి అన్నారు. విగ్రహావిష్కర‌ణ కార్యక్రమాన్ని ఘ‌నంగా నిర్వహిస్తామ‌ని ముఖ్యమంత్రి ప్రక‌టించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, ప‌లువురు శాస‌న‌స‌భ్యులు, శాస‌న‌మండ‌లి స‌భ్యులు, ఎంపీలు, కార్పొరేష‌న్లు చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments