స్పాట్ వాయిస్, డెస్క్ :ఉగాది తో తెలుగువారికి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. బుధవారం ప్రజలు శ్రీ శోభకృత్ నామ సంవత్సరంగా ఉగాది పండగను వైభవంగా జరుపుకున్నా రు. చైత్రమాసంలోని శుక్లపక్ష పాడ్యమినాడు రోజు ఉగాది పండుగ వస్తుంది. రాశుల ప్రకారం ఈరోజు నుంచి జీవితంలో చాలా మార్పులు వస్తాయని అనాదిగా ప్రజలు నమ్ముతుంటారు. అందుకే పంచాంగ శ్రవణం ద్వారా అన్ని విషయాలు తెలుసుకుంటారు. ఈ సంవత్సరం వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం.
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆదాయం 5, వ్యయం 5
రాజపూజ్యం 3, అవమానం 1.
ఈ రాశి వారికి శని 11వ స్థానంలోనూ, రాహువు వ్యయం లోనూ, కేతువు 6లోనూ సంచరించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో వృద్ధి లభిస్తుంది. వ్యాధులకి గురైనవారు కోలుకుంటారు. అప్పుల బాధ తగ్గిపోతుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో వస్తుంది. అవివాహితులకి జూలై, నవంబర్ నెలల మధ్య పెళ్లి సంబంధం కుదరే అవకాశాలు ఉన్నాయి. విదేశాలలో ఉద్యోగం, స్థిరపడటానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. నిరుద్యోగులు ఆశించిన స్థాయిలో ఫలితాలని పొందుతారు. ఇష్ట దైవాన్ని, కుల దైవాన్ని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
వృషభ రాశి (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆదాయం 14, వ్యయం 11
రాజపూజ్యం 6, అవమానం 1.
ఈ రాశి వారికి ఏప్రిల్ 23 నుంచి గురువు వ్యయం లోనూ, అక్టోబర్ చివరి వారి నుంచి రాహువు లాభ స్థానంలోనూ, కేతువు పంచమ స్థానం లోనూ సంచరిస్తున్నాడు. ఈ సంవత్సరం శని దశమ స్థానంలో తిరగడం వల్ల ఉద్యోగం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాయానికి, సంపాదనకు, లాభాలకు లోటు ఉండదు కానీ అనవసర ఖర్చులు ఉంటాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. గృహ, వాహన యోగం పట్టవచ్చు. ఈ రాశి వారు శివనామస్మరణ చేయటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.
మిథున రాశి (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆదాయం 2, వ్యయం 11
రాజపూజ్యం 2, అవమానం 4
ఈ ఏడాది భాగ్య స్థానంలో శనీశ్వరుడు, లాభ స్థానంలో గురువు, పంచమ స్థానంలో కేతువు సంచరిస్తున్నందువల్ల ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఊహించని విధంగా కొన్ని పనులు జరిగి జీవితం కొత్తగా మారుతుంది. పెళ్లి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. శుభ వార్తలని వింటారు. వ్యాపారులు, వివిధ వృత్తుల వారు, ఐటీ నిపుణులు ఆర్థికంగా ఆశించిన ప్రయోజనాలను పొందడం జరుగుతుంది. దుర్గాదేవిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలని పొందవచ్చు.
కర్కాటక రాశి (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆదాయం 11, వ్యయం 8
రాజపూజ్యం 5, అవమానం 4.
ఈ ఏడాది శని అష్టమంలోనూ, గురువు, రాహువులు దశమంలోనూ, కేతువు చతుర్ధం లోనూ సంచరిస్తున్నందువల్ల మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో కష్టపడటం వల్ల కొద్దిగానే ఫలితం ఉంటుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. పెళ్లి ప్రయత్నాలు కొద్దిగా చికాకు కలిగిస్తాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. అష్టమ శని కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. వినాయకుడిని పూజించడం వల్ల కలిసివస్తుంది.
సింహ రాశి (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆదాయం 14, వ్యయం 2
రాజపూజ్యం 1, అవమానం 7.
ఈ రాశి వారికి సప్తమ స్థానంలో శనీశ్వరుడు, నవమ స్థానంలో గురు రాహువులు, మూడవ స్థానంలో కేతువు సంచరిస్తున్నందువల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. భాగ్యరాశిలో గురు రాహువుల సంచారం వల్ల అనుకోని అదృష్టాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో సంపాదన, వృత్తిలో ఆదాయం, వ్యాపారంలో లాభాలు పెరగవచ్చు. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు తిరిగి చేతికి వస్తుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. అధికార యోగం పట్టే అవకాశం ఉంది. వాహన ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. శివుడిని ఆరాధించటం వల్ల శుభ ఫలితాలను చూస్తారు.
కన్యా రాశి (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆదాయం 2, వ్యయం 11
రాజపూజ్యం 4, అవమానం 7.
ఈ ఏడాది ఆరవ స్థానంలో శని, 8వ స్థానంలో గురు రాహువులు, రెండవ స్థానంలో కేతువు సంచరిస్తున్నందువల్ల వీరికి ఎక్కువగా ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో పని భారం పెరిగి శ్రమ అధికం అవుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులు పెరుగుతాయి. పిల్లలు బాగా ఒత్తిడికి గురవటం జరుగుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అధికారులతో ఆచితూచి మాట్లాడాలి. వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆదాయం : 8 వ్యయం : 8 రాజ్యపూజ్యం:7 అవమానం : 5
ఈ రాశివారికి ఈ ఏడాది గురువు, శనిలు అనుకూలంగానే ఉన్నా రాహు, కేతువుల సంచారం అధికంగా ఉండటం వల్ల ఊహించని సమస్యలెదురవుతాయి. వ్యవహారాల్లో ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవటం ఉత్తమం. కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులు కలిసిరావు. పొదుపునకు ఆస్కారం లేదు.
స్థిరచరాస్తుల క్రయ విక్రయాల్లో మెలకువ వహించండి. ఆశించిన పదవులు దక్కవు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. శుభకార్యం తలపెడతారు. పరిచయాలు, బంధువుత్వాలు అధికమవుతాయి. విద్యార్థులు ఉన్నత ర్యాంకులు సాధిస్తారు. దంపతుల మధ్య తరచు కలహాలు, పట్టింపులు తప్పవు. ఉద్యోగస్తులకు పదోన్నతి, స్థానచలనం. అధికారులకు హోదామార్పు, అదనపు బాధ్యతలు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆదాయం : 14 వ్యయం : 14 రాజ్యపూజ్యం : 3 అవమానం : 1
ఈ రాశి వారి గోచారం పరిశీలించగా కుజస్తంభన ప్రభావం వల్ల స్వల్ప ఇబ్బందు లుంటాయి. అయితే మిగిలన గృహాలను అనుకూలిస్తాయి. గురు సంచారం వల్ల అన్ని విధాలా ప్రోత్సాహకరంగానే ఉంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు.
ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. తరచు ఆరోగ్య సమస్యలెదురవుతాయి. వైద్య సేవలతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త ప్రయోగాలు చేస్తారు. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు శుభయోగం.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆదాయం : 2 వ్యయం : 8 రాజ్యపూజ్యం : 5 అవమానం : 1
ఈ రాశి వారికి ఈ సంవత్సరం గ్రహాన్నీ అనుకూలిస్తాయి. నిజాయితీగా మెలిగి ప్రశంసలందుకుంటారు. ఆదాయం బాగుంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వాహనం, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. యత్నాలకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంది. తరచు వేడుకలు, శుభకార్యాలు చేస్తారు. అవివాహితులకు శుభయోగం. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరుల మధ్య ఆస్తి వ్యవహారాలు ప్రస్తావనకు వస్తాయి.
వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. పదవులు, బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. స్త్రీలకు ధనలాభం, వస్త్ర ప్రాప్తి ఉన్నాయి. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. రిటైర్డు ఉద్యోగస్తులకు రావలసిన ఫలితాలు అందుతాయి. అధికారులకు హోదామార్పు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆదాయం : 5 వ్యయం : 2 రాజ్యపూజ్యం : 2 అవమానం : 4
ఈ రాశి వారి గోచారం ప్రకారం ఏలిననాటి శని, అర్ధాష్టమ రాహువు, తృతీయ గురువులు ప్రతికూల ఫలితాలే ఇస్తాయి. అయితే మిగిలిన గృహాలు అన్ని విధాలా అనుకూలిస్తాయి. ఓర్పు, పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఆలస్యంగానైనా సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. కీలక పదవులు అందుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ఆదాయం బాగుంటుంది. దుబారా ఖర్చులు తగ్గించుకోగల్గుతారు.
దంపతుల మధ్య తరచు అవగాహన లోపం, అకాల కలహాలు తలెత్తుతాయి. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ అవసరం. సంతానానికి విదేశీయానం, ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. వివాహయత్నం ఫలిస్తుంది. శుభకార్యాలను ఘనంగా చేస్తారు. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆశాజనకం. పంట దిగుబడి, గిట్టుబాటు ధర లభిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆదాయం : 5 వ్యయం : 2 రాజ్యపూజ్యం : 5 అవమానం : 4
ఈ రాశివారికి ఏ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. లక్ష్యసాధనలో అవాంతరాలెదురవుతాయి. పట్టుదలతో కార్యసాధనకు శ్రమించాలి. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. ఏదో సాధించలేకపోయాన్న వెలితి వెన్నాడుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం అనుకూలిస్తుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆశించిన పదవులు దక్కవు.
ప్రత్యర్థులతో సమస్యలు తలెత్తుతాయి. గృహ నిర్మాణాలు చేపడతారు. స్థిరాస్తి క్రయ విక్రయం అనుకూలిస్తుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. తరచు అనారోగ్యానికి గురవుతారు. వైద్య సేవలతో ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం.
మీన రాశి (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదాయం 8, వ్యయం 11
రాజపూజ్యం 1, అవమానం 2.
ఈ రాశివారికి వ్యయంలో శని, రెండవ స్థానంలో గురు రాహులు అష్టమంలో కేతువు సంచరిస్తున్నందువల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఊహించని విధంగా ధన సంపాదన పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో గణనీయంగా మెరుగుదల ఉంటుంది. రుణ సమస్యలు బాగా తగ్గుతాయి. వడ్డీ వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది. గృహ యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. పిల్లలు కష్టపడాల్సి ఉంటుంది. అధికారులతో అతి జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. బంధు మిత్రులతో ఆర్థిక వ్యవహారాలు పెట్టుకోవడం ప్రస్తుతానికి మంచిది కాదు. వినాయకుడిని ఎక్కువగా పూజించడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి.
Recent Comments