2లక్షలు ఇచ్చాకే తల కొరివి పెట్టిన కొడుకు..
స్పాట్ వాయిస్, క్రైమ్: బంగారం, డబ్బుల కోసం తల్లి అంత్యక్రియలు నిర్వహించకుండా రెండు రోజులు రోజులు ఆపి ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని కందులవారి గూడెం గ్రామంలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
నేరేడుచర్ల మండలం కందులవారిగూడేనికి చెందిన వేం వెంకటరెడ్డి, లక్ష్మమ్మ (80) దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలున్నారు. చిన్న కుమారుడు గతంలోనే చనిపోయాడు. భర్త వెంకటరెడ్డి కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. ఐదేళ్లుగా లక్ష్మమ్మ నేరేడుచర్లలోని చిన్న కుమార్తె వద్దే ఉంటుంది. ఇటీవల ఆమె ఇంట్లో కాలుజారి కిందపడింది. దీంతో లక్ష్మమ్మను మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఇంటికి తీసుకెళ్లాలని, ఆక్సిజన్‌పైనే బతుకుతుందని చెప్పారు. దీంతో బుధవారం అంబులెన్స్‌లో లక్ష్మమ్మను ఆక్సిజన్‌తోనే చిన్న కూతురు ఇంటికి తీసుకెళ్లింది. ఈలోగా ఆమె కుమారుడు అక్కడికి చేరుకుని, పెద్ద మనుషులతో పంచాయితీ పెట్టించాడు. తల్లిని తన ఇంటికి తీసుకెళ్తానని చెప్పాడు. దీనికి మిగతా కూమార్తెలు ఆస్తి పంపకాలు తేలేవరకూ అమ్మను తీసుకెళ్లనీయమని పట్టుబట్టారు. ఈ క్రమంలోనే రాత్రి 11:00 గంటల సమయంలో లక్ష్మమ్మ చనిపోయిoది. దీనితో కుమారుడు లక్ష్మమ్మ మృతదేహాన్ని కందులవారిగూడెం తరలించారు. అయినా వారి మధ్య పంచాయితీ మాత్రం తీరలేదు.
లక్ష్మమ్మ రూ.21 లక్షల వరకు పలువురికి అప్పులిచ్చారు. ఆమె ఒంటిపై 20 తులాల బంగారు ఆభరణాలున్నాయి. అయితే లక్ష్మమ్మ వైద్య ఖర్చులు భరించిన చిన్నకూతురికి రూ.21 లక్షల్లోంచి రూ.6 లక్షలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. మిగిలిన రూ.15 లక్షలకు సంబంధించిన పేపర్లను కుమారుడికి అప్పజెప్పారు. 20 తులాల బంగారు ఆభరణాలను ముగ్గురు కూతుళ్లు పంచుకున్నారు. అంతా అయిపోయిందిలే అనుకుంటున్నా సమయంలోనే కుమారుడు తాను అంత్యక్రియల ఖర్చు భరించలేనని, తనకు డబ్బులిస్తేనే తలకొరివి పెడతానన్నాడు. శుక్రవారం ఉదయం పెద్ద మనుషులు అంత్యక్రియల ఖర్చుకు రెండు లక్షలు ఇప్పియడంతో ఆ పంచాయితీ కొలిక్కి వచ్చింది. తర్వాత ఆమె అంత్యక్రియలను నిర్వహించారు.
Recent Comments