బీజేపోళ్ల కాళ్లు మొక్కింది నిజం కాదా..
ఎమ్మెల్సీ కవితపై.. మంత్రి కొండా ఫైర్
స్పాట్ వాయిస్, హన్మకొండ: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లిక్కర్ రాణిగా కవిత పేరుగాంచిందని, ఆమె మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని మంత్రి కొండా సురేఖ అన్నారు. హన్మకొండ జిల్లాలో కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ అభివృద్ధిపై ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కొండా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎమ్మెల్సీ కవిత, ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. భద్రాద్రి శ్రీరాముల వారి కల్యాణానికి కేటీఆర్ కొడుకు హిమాన్షు పట్టు వస్త్రాలను ఏ హోదాలో సమర్పించాడో కవిత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లిక్కర్ కేసులో బీజేపీ నేతల కాళ్లు పట్టుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. దమ్ముంటే నిజామాబాద్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని కవిత పదే పదే ప్రస్తావిస్తున్నారన్నారు. ఈడీలు ప్రశ్నిస్తే ఢిల్లీకి వెళ్లి మహిళా బిల్లంటూ కవిత నాటకాలు ఆడారని ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల కుటుంబం, బీఆర్ఎస్ నేతలు ప్రజల సొమ్మును అప్పనంగా దోచుకు తిన్నారని ధ్వజమెత్తారు. తాము తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా ఉంటామని, బీఆర్ఎస్ నేతలకు అసలే కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై చిల్లర విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. బతుకమ్మ, జాగృతి పేరుతో ప్రజల్లో ఉండాలని కవిత చూస్తున్నారని.. ఆమె పప్పులు ఇక ఉడకవని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. గత ప్రభుత్వ ఎమ్మెల్యేలు కబ్జాలకు, రౌడీయిజంకే పరిమితం అయ్యారని ఆరోపించారు. ఎమ్మెల్యే నిధులులను కూడా వాడుకోలేక పోయారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వరంగల్ పై సవతి తల్లి ప్రేమ చూపెట్టిందని చెప్పారు. వరంగల్ ఎమ్మెల్యే 3కోట్ల నిధులు కూడా వాడుకోలేదన్నారు. వరంగల్ ను రెండో అతి పెద్ద సిటీగా తయారు చేస్తామని, వర్ధన్నపేట లో నూతనంగా గ్రౌండ్ ను నిర్మిస్తామని చెప్పారు. వరంగల్ బస్టాండ్ ను నూతనంగా నిర్మిస్తామని, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని పేర్కొన్నారు.
Recent Comments